tennis: నాదల్, ఫెదరర్, నేను కలిస్తే అతను!: అల్కరాజ్పై జకోవిచ్ ప్రశంసలు
- వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్
- ఫైనల్లో జకోవిచ్ ను ఓడించిన స్పెయిన్ యువ కెరటం
- అతనిపై ప్రశంసలు కురిపించిన జకోవిచ్
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, స్పెయిన్‌కు చెందిన 20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4తో రెండో సీడ్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనను ఓడించిన అల్కరాజ్ పై జకోవిచ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అల్కరాజ్ లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ , స్విట్జర్లాండ్ గ్రేట్ రోజర్ ఫెదరర్, తనలోని గొప్ప లక్షణాలు ఉన్నాయని కొనియాడాడు.
‘ఈ ఆటలో అల్కరాజ్ చాన్నాళ్లు ఉండబోతున్నాడు. నేనింకా ఎంత కలం కొనసాగుతానో తెలియదు. తను ఈ ఏడాది గ్రాస్ కోర్టులో ఇంత బాగా ఆడుతాడని నేను ఊహించలేదు. కానీ అతను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని నిరూపించుకున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల కోర్టులపై అతను అద్భుతమైన టెన్నిస్ ఆడుతున్నాడు. తను ఈ స్థానంలో (నంబర్ వన్) ఉండటానికి పూర్తిగా అర్హుడు. అతనిలో రోజర్, రఫా, నా ఆటలోని ఉత్తమమైన అంశాలను చూపెడుతున్నాడని ఏడాదిగా అంతా మాట్లాడుతున్నారు. నేను దానితో ఏకీభవిస్తాను. అతను మా ముగ్గురిలో అత్యుత్తమంగా ఉన్నాడని నేను భావిస్తున్నా. నిజాయతీగా చెప్పాలంటే అతనిలాంటి ఆటగాడితో నేను ఎప్పుడూ ఆడలేదు’ అని జకోవిచ్ చెప్పుకొచ్చాడు.