Atchannaidu: అప్పర్ భద్రపై కేంద్రాన్ని ప్రశ్నించడం చేతగాని దద్దమ్మ జగన్ రెడ్డి: అచ్చెన్నాయుడు

Atchnnaidu take a jibe at CM Jagan over Rayalaseema projects

  • రాయలసీమ ప్రాజెక్టులు-వాస్తవాలు పేరిట అచ్చెన్న ప్రెస్ మీట్
  • జగన్ నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శలు
  • జగన్ రాయలసీమ ద్రోహి అని వ్యాఖ్యలు
  • జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేశారని వెల్లడి

రాయలసీమ ప్రాజెక్టులు-వాస్తవాలు పేరిట టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం జగన్ ను ఏకిపారేశారు. జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 4 ఏళ్లల్లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరాకు సాగు నీరందించలేదు అని విమర్శించారు. అప్పర్ భద్రపై కేంద్రాన్ని ప్రశ్నించడం చేతగాని దద్దమ్మ జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

"తుంగభద్ర నది కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన నీటిలో అంతర్గతంగా సర్దుబాట్లతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని కేంద్ర జలవనరుల శాఖ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022లో పంపింది. 

కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.5300 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్‌లో కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీళ్ళను, పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాల్లో లభించే 21 టీఎంసీ నీటిలో 2.4 టీఎంసీల నీటిని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సా‌ధించింది.

కానీ జగన్ ప్రభుత్వం కరవు పీడిత రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచి అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది" అని వివరించారు. 

నాడు జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం... పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం... రక్షిత మంచినీరు–సాగు నీరు కల నిజం చేస్తాం... చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తాం అంటూ వైసీపీ 2019 మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. కానీ 4 ఏళ్లుగా జలవనరుల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, బడ్జెట్ లెక్కలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతాయని అన్నారు. 

టీడీపీ ఐదేళ్లలో జలవనరుల రంగంలో రూ.68,293.94 కోట్ల వ్యయం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. 23 ప్రాజెక్టులను పూర్తి చేసి, 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందించిందని వివరించారు.

జగన్ ప్రభుత్వం 4 ఏళ్లల్లో రూ. 28,998.05 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ఒక్క ఎకరాకు సాగునీరందించలేదని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. 

కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇచ్చాం

పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్లే రాయలసీమ సాగుకు సకాలంలో నీరందించి చీని చెట్లను కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిచ్చామని, కానీ జగన్ రెడ్డి కుప్పానికి నీళ్లందించకుండా కక్ష సాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు.

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ జాడేది?

జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ) కింద 23 ప్రాజెక్టుల కోసం రూ.33,862 కోట్లతో భారీఎత్తున టెండర్లు కూడా పిలిచి ఉత్తుత్తి హడావుడి చేసిందని విమర్శించారు. "జగన్ ప్రభుత్వం కరువు పీడిత రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచి అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం, ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోని జగన్ చర్యలను రాయలసీమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సకాలంలో బుద్ది చెప్పేందుకు సిద్దమవుతున్నారు" అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News