Iran: ఇరాన్ విమానాశ్రయంలో 66 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న హీట్ ఇండెక్స్
- ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు నమోదు
- ప్రాణంతో ఉన్న ఎవరూ ఆ వేడిమిని తట్టుకోలేరన్న అమెరికా నిపుణుడు
- వాతావరణంలో వేడిమికి అధిక తేమ తోడైందని వెల్లడి
- దాంతో హీట్ ఇండెక్స్ ఒక్కసారిగా పెరిగిపోయిందని వివరణ
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది భానుడు మహోగ్రరూపం ప్రదర్శిస్తున్నాడనడంలో అతిశయోక్తి లేదు. చల్లదనంతో అలరారే యూరప్ దేశాలు సైతం ఎండ వేడిమితో మండిపోతున్నాయి. భారత్ లోనూ ఈ వేసవిలో చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి.
కాగా, ఇరాన్ లోని పర్షియల్ గల్ఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రికార్డు స్థాయిలో 66.7 డిగ్రీ సెల్సియస్ వేడిమి నమోదైంది. ఈ ఆధునిక విమానాశ్రయం ఇరాన్ లోని అసాలుయే ప్రాంతంలో ఉంది.
ఈ ఎయిర్ పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హీట్ ఇండెక్స్ 66.7 డిగ్రీలుగా నమోదైనట్టు కొలిన్ మెకార్తీ అనే అమెరికా వాతావరణ నిపుణుడు తెలిపారు. ప్రాణాలతో ఉన్న ఎవరూ కూడా ఇంత వేడిమిని తట్టుకోలేరని వివరించారు.
భగభగలాడే సూర్యరశ్మికి వాతావరణంలోని అపారమైన తేమ తోడైతే ఇలాంటి అత్యుష్ణ పరిస్థితులు ఏర్పడతాయని మెకార్తీ విశ్లేషించారు. మధ్యాహ్నం సమయానికి పర్షియన్ గల్ఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, ఆ సమయంలో వాతావరణంలో తేమ 65 శాతానికి పెరిగిపోయిందని తెలిపారు. దాంతో, తీవ్ర వేడిమికి తేమ వాతావరణం తోడవడంతో ఒక్కసారిగా హీట్ ఇండెక్స్ 66 డిగ్రీల సెల్సియస్ దాటిందని వివరించారు.