Revanth Reddy: కేటీఆర్! సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక... ఎక్కడైనా సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానన్న టీపీసీసీ చీఫ్
- ఎంపీ కోమటిరెడ్డి నిరూపించారని వెల్లడి
- విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, నిరూపిస్తానని చెబితే మంత్రి కేటీఆర్ ఎక్కడకు రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉచిత విద్యుత్‌పై చర్చకు తాము సిద్ధమన్నారు. 24 గంటల విద్యుత్ రాష్ట్రంలోనే లేదన్నారు. త్రీఫేజ్ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెప్పారని, ఎనిమిది నుండి పది గంటలు ఇస్తున్నట్లు వెల్లడించారన్నారు. రోజంతా సింగిల్ ఫేజ్ కరెంటే ఇస్తున్నారని, ఇదే విషయాన్ని ట్రాన్స్ కో సీఎండీ గతంలో చెప్పారన్నారు. ట్రాన్స్ కో లాగ్ బుక్స్ ప్రకారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని నిరూపించారన్నారు. సాగు కోసం ఎవరూ సింగిల్ ఫేజ్ మీటర్లు ఉపయోగించరని తెలుసుకోవాలన్నారు.
విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారని, ఇందులో రూ.8 వేల కోట్లు బీఆర్ఎస్ నేతలే దోచుకుంటున్నారన్నారు. ఎక్కువ గంటలను చూపిస్తూ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, కానీ సాగుకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం లేదని, నిరూపించేందుకు తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక.. ఎక్కడకైనా వస్తానన్నారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తామంటే కేసీఆర్ కొనుగోలు చేయడం లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో అవసరానికి మించి విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. కాబట్టి తక్కువకు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.