Qin Gang: ఏమైపోయావయ్యా.. అమాత్యా.. మూడు వారాలుగా కనిపించని చైనా విదేశాంగ మంత్రి

Where is Qin Gang minister missing nearly one month

  • చివరిసారి గత నెల 25న కనిపించిన క్విన్ గాంగ్
  • ఆయన ఎక్కడంటూ ఆరా తీస్తున్న చైనా ప్రజలు
  • కారణాలు ఏమై ఉంటాయన్నదానిపై విపరీత చర్చ
  • అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు

చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ ఏమైపోయారు? ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది. మూడు వారాలుగా ఆయన పత్తా లేకపోవడంతో ఏమైపోయారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న క్విన్ గతంలో అక్కడ చైనా రాయబారిగా కూడా పనిచేశారు. యూఎస్‌తో సంబంధాలు గాడిన పెట్టేందుకు జరుగుతున్న ఉన్నతస్థాయి దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్న సమయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన చివరిసారి బీజింగ్‌లో గత నెల 25న శ్రీలంక విదేశాంగమంత్రితో సమావేశంలో కనిపించారు. ఈ నెల మొదట్లో ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్‌తో జరిగిన చర్చల్లో కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న క్లైమేట్ రాయబారి జన్ కెల్లీ పర్యటనలో కానీ ఆయన పాల్గొనడం లేదు. 

మరోవైపు చైనా సోషల్ మీడియా ‘వీబో’లో ‘క్విన్ గాంగ్ ఎక్కడ?’ అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోయింది. క్విన్ అదృశ్యం వెనక అనారోగ్యం కానీ, రాజకీయపరమైన కారణం కానీ ఉండే అవకాశం ఉందని జర్నలిస్ట్, విశ్లేషకుడు ఫిల్ కన్నింగ్‌హామ్ అనుమానం వ్యక్తం చేశారు. చైనా దౌత్య విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన 57 ఏళ్ల క్విన్‌ను ‘వోల్ఫ్ వారియర్’గా పిలుస్తారు. భవిష్యత్తులో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీలో విదేశీ వ్యవహారాల అధికారిగా వాంగ్ యీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. అంతలోనే ఆయన అదృశ్యం  కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News