Asia climate crisis: ఆసియాలో వాతావరణ సంక్షోభం.. ఓవైపు ముంచెత్తుతున్న వానలు.. మరోవైపు భారీ ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?

Soaring temperatures to record rainfall Asia reels as climate crisis takes hold

  • భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భారీ వర్షాలు
  • మన దేశంలో ఎడతెరిపిలేని వానలతో ఉత్తరాది అతలాకుతలం
  • చైనాలో రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • జపాన్ లో వడగాడ్పులు.. వృద్ధులపై తీవ్ర ప్రభావం 
  • మానవ తప్పిదాల కారణంగానే వాతావరణ సంక్షోభమంటున్న శాస్త్రవేత్తలు 
  • భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరికలు

ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యధిక జనాభా కలిగిన ఆసియా ఖండం ఇప్పుడు వాతావరణ సంక్షోభంలో చిక్కుకుంది. ఆసియాలోని ప్రధాన దేశాలైన భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో భారీ వర్షాలు పోటెత్తుతున్నాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని చోట్ల ఎన్నడూ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి.

ముఖ్యంగా మన దేశంలో వానలు ఉత్తరాదిని కుదిపేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, అస్సాం, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కురుస్తూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు ఊర్లకు ఊర్లను ముంచెత్తుతున్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెల 10న ఢిల్లీలో వర్షాలు కురిశాయి. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. వరదల ధాటికి ఢిల్లీలోని ఎర్రకోట, సీఎం నివాసం సహా ఎన్నో ప్రాంతాలు జలమయమయ్యాయి. యూపీలోని తాజ్ మహల్ ను కూడా వరద తాకింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. యమున ఇంకా ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది.

వానలు ఆగడం లేదు. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు పడటం లేదు. మేఘాలు ఆవరిస్తున్నా.. చిన్న చినుకులే తప్ప పెద్ద వానలు కురవడం లేదు. దీంతో చాలా చోట్ల విత్తనాలు కూడా మొలకత్తని పరిస్థితి.

గత శనివారం దక్షిణ కొరియాలోని చియంగ్జు సిటీలో పోటెత్తిన ఆకస్మిక వరదలతో అండర్ పాస్ కింద చిక్కుకుని 13 మంది చనిపోయారు. మొత్తంగా సౌత్ కొరియాలో ఇటీవల 41 మంది చనిపోయారు. ‘‘భవిష్యత్ లో ఈ రకమైన తీవ్ర వాతావరణ పరిస్థితులు సర్వసాధారణం అవుతాయి. వాతావరణ మార్పులను మనం అంగీకరించాలి. అందుకు అనుగుణంగా మనం వ్యవహరించాలి’’ అంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండాలంటూ తన ప్రజలను హెచ్చరించారు. జపాన్ లో కురిసిన రికార్డు స్థాయి వానలకు ఆరుగురు చనిపోగా, ఎంతో మంది గల్లంతయ్యారు. ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వర్షాలు పడుతున్నాయంటూ జపాన్ వాతావరణ శాఖ చెప్పడం గమనార్హం. ఫిలిప్పీన్స్, కాంబోడియా తదితర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. 

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
ఇంకో వైపు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం చైనాలో రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. చైనాలోని 5కు పైగా వాతావరణ కేంద్రాల్లో 50 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో బీజింగ్ లో 40 డిగ్రీల పైన ఎండలు ఠారెత్తించడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు సోమవారం జపాన్ లోని కిర్యులో 39.7 డిగ్రీలు, హాటొయామా సిటీలో 39.6 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో వడదెబ్బకు గురవుతున్న వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. జపాన్ లో వృద్ధుల సంఖ్య 28 శాతం కావడం గమనార్హం.

మానవ తప్పిదాలే కారణం
‘‘మానవ తప్పిదాల కారణంగా వాతావరణ సంక్షోభం పెరిగిపోతోంది. పరిస్థితి ఇలానే ఉంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. అవి మరింతగా పెరుగుతాయి’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 440 కోట్ల మందికిపైగా జనాభా ఉన్న ఆసియా.. వాతావరణ మార్పుల ప్రభావానికి తీవ్రంగా గురవుతుందని, ఇటీవలి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా నీటి కొరత, పంట వైఫల్యాలు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ విపత్తుల వల్ల పేదలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని పేర్కొంటున్నారు. 

పాకిస్థాన్ తోనే ఆగిపోదు
పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని శాస్త్రవేత్తలు ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు. గతేడాది పాకిస్థాన్ లో పోటెత్తిన వరదలకు 1,700 మంది చనిపోయారు. లక్షలాది మంది గూడు కోల్పోయారు. ఇదే సమయంలో వరదలకు పంటలన్నీ నాశనమయ్యాయి. ఈ ప్రభావంతో పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. సామాన్యలు కొనలేని స్థితికి నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ‘‘పాకిస్థాన్ లో జరిగినది.. పాకిస్థాన్ తోనే ఆగిపోదు’’ అంటూ గతేడాది సెప్టెంబర్ లో పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు హెచ్చరికల్లాంటివి. ప్రకృతి తిరిగి పోరాడుతుందని, దాన్ని అడ్డుకునేందుకు మనం సరిపోమని, ఉమ్మడి అజెండాతో ప్రపంచం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పేదలే బాధితులు
‘‘సమస్యను సృష్టించింది పేదలు కాదు.. కానీ వాతావరణ మార్పులకు బాధితులుగా మారుతున్నది మాత్రం పేదలే. వరదలు, కరవులు, ఇతర వినాశకరమైన వాతావరణ విపత్తులు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి’’ అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News