Sri Lanka Sri Lanka: శ్రీలంకలో సంక్షోభం ముగిసిందా? ఇప్పుడు అక్కడ ఎలా ఉంది?
- ఏడాది కిందట ఆందోళనలతో అట్టుడికిన శ్రీలంక
- ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో విలవిల్లాడిన ద్వీప దేశం
- పెరుగుతున్న పర్యాటకులతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలోకి
- భారీగా పెరిగిన ధరలు, పన్నులు.. యువత వలసలు ఆందోళనకరం
- దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోయిన మధ్యతరగతి కుటుంబాలు
- పరిస్థితి ఇలానే ఉంటే మళ్లీ సంక్షోభం తలెత్తే ప్రమాదం
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ద్వీప దేశం శ్రీలంక.. ఆందోళనలతో ఏడాది కిందట అట్టుడికింది. ప్రజాగ్రహానికి గురైన రాజపక్స కుటుంబం.. దేశాన్ని విడిచి పారిపోయింది. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు.. వంట గ్యాస్ కొరత.. కరెంటు కోతలతో ఏడాది కిందట శ్రీలంక ప్రజలు అల్లాడిపోయారు. ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు శ్రీలంక ఎలా ఉంది? సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా? సంక్షోభం ముగిసినట్లేనా?
ప్రాణం పోసిన పర్యాటకం
రోజులు ఒకేలా ఉండవు కదా.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆహారం, ఇంధనం, మందులు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. ఆఫీసులు, స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రజా రవాణా యథావిధిగా నడుస్తోంది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. కరోనా వ్యాప్తితో పర్యాటకులు తగ్గిపోయారు. అంతర్యుద్ధంతో పరిస్థితి మరింత దిగజారింది. కానీ ఇప్పుడిప్పుడే పర్యాటకం కళను సంతరించుకుంటోంది. వివిధ దేశాల ప్రజలు వస్తున్నారు. గతేడాదితో పోలిస్తే టూరిజం రెవెన్యూ 30 శాతం పెరిగింది. ‘‘సంక్షోభం నుంచి కోలుకోవడం మాకు ఓ మాయలా అనిపిస్తోంది. గతేడాది పరిస్థితులను చూసినప్పుడు ఈ దేశం మనుగడ సాగిస్తుందో లేదో కూడా మాకు అర్థం కాలేదు’’ అని శ్రీలంకలోని ప్రముఖ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ ‘జెట్‌వింగ్స్ సింఫనీ’ సీఈవో హిరాన్ కూరే చెప్పారు.పూర్తిగా మారలేదు
పైకి మెరుగ్గా కనిపిస్తున్నా.. దేశంలో ఆర్థిక పరిస్థితి ఇంకా మారలేదు. సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. నిత్యావసరాల కొరత లేదు.. కానీ వాటిని కొనడం సామాన్యులకు కష్టంగా మారింది. మునుపెన్నడూ లేనంత ఖరీదైపోయాయి. దేశంలోని దాదాపు సగం మంది తమ కుటుంబ ఆదాయంలో 70% ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నారు. ఆహారం, దుస్తులు, ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆదాయ పన్నును దాదాపు 36 శాతం పెంచారు. ఇది కూడా పెను భారంగా మారింది. విద్యుత్ చార్జీలను 65 శాతం దాకా పెంచారు. సబ్సిడీలను ఎత్తేశారు. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు.. దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోయాయి.
ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇంకా ఆందోళనకర స్థితిలోనే ఉంది. ఇప్పటికీ 80 బిలియన్ డాలర్ల (రూ.6.56 లక్షల కోట్లు) అప్పు ఉంది. గొటబాయ రాజపక్స తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె.. ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) నుంచి 2.9 బిలియన్ డాలర్ల (రూ.23,788 కోట్లు) సాయం పొందారు. ఇతర నిధులకు మార్గాలను తెరవడానికి, కొరతను తగ్గించడానికి ఈ సాయం చాలా కీలకంగా పని చేసింది. కానీ కఠినమైన ఆర్థిక, పాలనా పరమైన సంస్కరణలతోనే ఈ డబ్బు వచ్చింది. వీటిని తిరిగి చెల్లించడం సవాళ్లతో కూడుకున్న పనే.
దేశాన్ని వీడుతున్న యువత
ఇక్కడ ఇబ్బందులను భరించలేక యువత దేశాన్ని వీడుతున్నారు. 2022లో 3.11 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ఈ స్థాయిలో దేశాన్ని వీడి వెళ్లిపోవడం ఎన్నడూ జరగలేదు. వీరిలో డాక్టర్లు, పారామెడికల్, ఐటీ ప్రొఫెషనల్స్ ఉండటం గమనార్హం. మేథో సంపత్తి తరలి వెళ్తుండటంతో దేశ ఆర్థిక పునరుద్ధరణ ఆందోళనకరంగా మారింది. స్థానిక వ్యాపారులకు నైపుణ్యం కలిగిన కార్మికులు దొరకడం లేదు.
మళ్లీ సంక్షోభంలోకి
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం సంస్కరణల భారం మోపకూడదని సిలోన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అనుప నందుల చెప్పారు. ‘‘సంక్షోభం వచ్చినప్పటి నుంచి ప్రజలు కష్టతరమైన జీవనశైలికి అలవాటు పడ్డారని నేను భావిస్తున్నాను. కానీ సమాచారం అందనప్పుడు.. సమాధానాలు దొరకనప్పుడు.. అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. మళ్లీ సంక్షోభ స్థితికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.