Novak Djokovic: వింబుల్డన్ లో రాకెట్‌ను విరగ్గొట్టినందుకు జకోవిచ్ కు భారీ జరిమానా
- వింబుల్డన్ ఫైనల్ లో అల్కరాజ్ చేతిలో ఓడిన జకోవిచ్
- మ్యాచ్ లో ఆగ్రహంతో టెన్నిస్ రాకెట్‌ను నెట్పోస్ట్కేసి కొట్టిన సెర్బియా స్టార్
- 8 వేల డాలర్ల జరిమానా విధించిన అంపైర్లు
24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న నొవాక్ జొకోవిచ్ కలను చెరిపేశాడు స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ఆదివారం ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన వింబుల్డన్ ఫైనల్ లో అల్కరాజ్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు జకోవిచ్. ఒకానొక సందర్భంలో తన టెన్నిస్ రాకెట్‌ను విరగ్గొట్టాడు.
ఐదో సెట్లో భాగంగా అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన జొకోవిచ్.. కాసేపటికే తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహంతో రాకెట్‌ను నెట్పోస్ట్కు బలంగా కొట్టాడు. తర్వాత విరిగిపోయిన రాకెట్ ను తనే తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంపైర్ ఫెర్గూస్ ముర్ఫీ.. జొకోవిచ్‌కు ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జకోవిచ్ కు 8 వేల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 6.5 లక్షలు) జరిమానా విధించారు. జొకోవిచ్‌కు విధించిన జరిమానా 2023లో అత్యధికం కావడం గమనార్హం.
మ్యాచ్ తర్వాత జకో మాట్లాడుతూ.. అల్కరాజ్ పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఫెదరర్, నాదల్, నాలోని కొన్ని అంశాలతో కూడిన అతని గేమ్ గురించి గత 12 నెలలుగా ప్రజలు మాట్లాడుతున్నారు. నేను కూడా దానితో ఏకీభవిస్తా. అతను మా ముగ్గురిలో అత్యుత్తమంగా ఉన్నాడని నేను భావిస్తున్నా’’ అని చెప్పాడు.