Varla Ramaiah: పోలీసు శాఖ పరువుపోతుందని చంద్రబాబు అడ్డుకున్నారు... లేకపోతేనా?: వర్ల రామయ్య

Varla Ramaiah press meet on police dept

  • అధికార పార్టీ పోలీసుశాఖలో కులవివక్షను పెంచిపోషిస్తోందన్న వర్ల
  • పోస్టింగుల్లో ఒక్క సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తున్నట్టు ఆరోపణ
  • జగన్ ప్రైవేటు సైన్యంలా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని విమర్శలు
  • పదవిని కాపాడుకునేందుకు డీజీపీ వెంపర్లాడుతున్నారని ఆగ్రహం

పోలీసు అధికారుల పోస్టింగుల మీద శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ? ప్రతిపక్షపార్టీ పోలీసు పోస్టింగులపై చేసిన ఆరోపణలు అసత్యం అంటూ శ్వేతపత్రం ఇవ్వగలరా? పోలీసులకు సమర్ధత, సామర్థ్యం చూసి పోస్టింగులు ఇస్తారా? కులాలు చూసి పోస్టింగులు ఇస్తారా? ఏ ప్రాతిపదికన పోస్టింగులు ఇస్తున్నారు డీజీపీ? అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుదు వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. 

'ప్రధానమైన పోస్టింగుల్లో రెడ్లు ఎంతమంది? మిగిలిన కులాలు ఎంత మంది? వీరిలో... సస్పెన్షన్ లో ఎంతమంది రెడ్డి అధికారులు ఉన్నారు? ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు? వీటిపై శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ?' అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని పోలీసు డిపార్ట్ మెంట్ లో కులవివక్షను అధికార పార్టీ వైసీపీ పెంచి పోషిస్తోందని రామయ్య ఆరోపించారు. 

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, పోలీసుశాఖ తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ చట్టపరంగా వ్యవహరించడం లేదన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన, అధికార పార్టీకి పోలీసు వ్యవస్థకు వత్తాసు పలకడమేనని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నడూ ఇంత దిగజారిన పరిస్థితులు పోలీసుశాఖ లో కనిపించలేదని, అధికారపార్టీ పోలీసు శాఖను తన గుప్పిట్లో పెట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వర్ల రామయ్య ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు...

పోలీసుశాఖలో కులవివక్ష

పోలీసుశాఖలో కులవివక్షను అధికారపార్టీ చొప్పించింది. ఒకే కులానికి ప్రధాన పోస్టింగులు... మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులకు  ప్రాధాన్యతలేని పోస్టింగులు ఇస్తున్నారు. 10 మందికి పోస్టింగులు ఇస్తే, అందులో 9 మంది అధికార పార్టీకి నచ్చిన వాళ్లకే పోస్టులు ఇస్తున్నారు. 

మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సంఘాలు డీఐజీ అమ్మిరెడ్డిని కలిసి పోస్టింగులు అన్నీ రెడ్డి కులానికే ఇస్తున్నారు, ఎస్సీ, ఎస్టీలను ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెడుతున్నారు అని విన్నవించారు. పోస్టింగులు ఇచ్చిన విషయంపై డీఐజీ ఎవరికీ అర్థంకాని రీతిలో వివరణ ఇచ్చి తప్పించుకున్నాడు.

అధికారంలోకి వచ్చిన మొదటిరోజే తప్పుడు కేసులపై కమిషన్

జగన్మోహన్ రెడ్డి అవినీతి, అసమర్థత, ప్రజావ్యతిరేక నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు గమనించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే. మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వైసీపీ పాలనలో పెట్టిన కేసులపై కమిషన్ వేస్తాం. అధికార పార్టీకి అనుకూలంగా పెట్టిన ప్రతి కేసును నిగ్గు తేలుస్తాం. తప్పు చేసిన ఏ పోలీసు అధికారినీ వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరిస్తున్నా. 

పోలీసులు చట్టబద్దంగా, చట్టాలకు అనుగుణంగా మాత్రమే పని చేయాలని హైకోర్టు ద్వారా చెప్పించడానికి హైకోర్టులో రిట్ పిటిషన్ వేద్దామని మా పార్టీ అధినేతను అడిగితే పోలీసుశాఖ పరువుపోతుంది, వద్దు అని అడ్డుకున్నారు. 

ఒకే కులానికి పట్టం కట్టడం, మిగిలిన కులాలను ఎలా ఇబ్బందిపెడుతున్నారో చెప్పడమే మా ఉద్దేశం. పోలీసుశాఖలో కులవివక్ష లేదని చెప్పేందుకు పోలీసుశాఖ నుండి డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

పోస్టింగుల జాతకం విప్పితే పోలీసుశాఖ పరువు పోతుంది

పోస్టింగులకు చెందిన ప్రతి కేసు వివరాలను నేను మీడియా ముందు ప్రస్తావిస్తే పోలీసుశాఖ పరువుపోతుంది. కులాన్ని చూసి పోస్టింగులు ఇవ్వొద్దు... కేవలం టాలెంట్ చూసి, పని సామర్థ్యాన్ని చూసి పోస్టింగులు ఇవ్వాలని కోరుతున్నాం. డీజీపీ స్థాయిలో ఉండి తన ఉనికిని, పోస్టును కాపాడుకోవడానికి రాజకీయ నాయకుల వద్దకు వెళ్లడం నిజమేనా డీజీపీ? ఇలా చేయొచ్చా? పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోవడం దారుణం.

పోలీసు పోస్టింగులపై శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ?

పోలీసు అధికారుల పోస్టింగులు మీద శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ? ప్రతిపక్షపార్టీ పోలీసు పోస్టింగులపై చేసిన ఆరోపణలు అసత్యం అంటూ శ్వేతపత్రం ఇవ్వగలరా? పోలీసులకు సమర్ధత, సామర్థ్యం చూసి పోస్టింగులు ఇస్తారా? కులాలు చూసి పోస్టింగులు ఇస్తారా? ఏ ప్రాతిపదికన పోస్టింగులు ఇస్తున్నారు డీజీపీ?

ప్రధానమైన పోస్టింగుల్లో రెడ్లు ఎంతమంది? మిగిలిన కులాలు ఎంత మంది? వీరిలో... సస్పెన్షన్ లో ఎంతమంది రెడ్డి అధికారులు ఉన్నారు? ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు? వీటిపై శ్వేతపత్రం ఇవ్వగలరా డీజీపీ? 

పోలీసు వ్యవస్థ అధికారపార్టీ ప్రైవేటు సైన్యం కాదా డీజీపీ?

పోలీసుశాఖ అధికార పార్టీకి సైన్యంలా వ్యవహరిస్తున్న మాట నిజం కాదా? పోలీసుశాఖ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్న మాట నిజం కాదా డీజీపీ? కిందిస్థాయి అధికారులు డీఐజీ, ఎస్పీ మాట వింటున్నారా, అధికార పార్టీ మాట వింటున్నారా? దీనిపై సమాధానం చెప్పగలరా డీజీపీ? 

రౌడీలకు పోలీసులు భయపడే పరిస్థితులు వచ్చాయి

చట్టం, ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఏపీ పోలీస్ మాన్యువల్.. ఇవేవీ పోలీసులు పాటించడం లేదు. గతంలో అసాంఘిక శక్తులు, నిందితులు పోలీసులను చూసి వణికిపోయేవారు. పోలీసు లాఠీ అధికార పార్టీ చేతిలోకి వెళ్లడంతో నేరస్తులు, నిందితులు పేట్రేగిపోతున్నారు. 

అధికార పార్టీ నాయకులను పోలీసులు గడ్డం పట్టుకుని బ్రతిమాలడం... ప్రతిపక్ష నాయకులను జుట్టుపట్టి లాగడం, ఈడ్చి ఈడ్చి తన్నడం.... ఈ వివక్ష ఏంటి? అధికార పార్టీ నేతలు ధర్నాలు చేస్తే బెయిలబుల్ కేసులు... ప్రతిపక్షాల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, జ్యుడీషియల్ కస్టడీకి పంపుతున్నారు.

పోలీసు అధికారుల సంఘం నిర్వీర్యం

పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నిర్వీర్యం అయిపోయింది. వర్ల రామయ్య, అయ్యన్నపాత్రుడు మీదకు మాత్రం సంఘం నేతలు ఎగిరెగిరి పడతారు. గతంలో పోలీసు అధికారుల సంఘంలోని ఓ నాయకురాలు ఇలాగే ఎగిరెగిరి పడి నేడు జైలులో ఉన్నారు. పోలీసులు ఇంత స్థాయిలో బానిసత్వం చేయడం, జీ హుజూర్ అనేలా చేయడం గతంలో లేవు.

దళిత ఎస్సైపై రౌడీ దాడిచేస్తే చర్యలు శూన్యం

సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో ఓ దళిత ఎస్సై రవిబాబుపై అధికార పార్టీకి చెందిన రౌడీ చిందులు తొక్కి, తిరగబడి కొట్టాడు. ఆ రౌడీని అరెస్టు చేయవద్దంటూ ఉన్నతస్థాయి అధికారులు ఫోన్లు చేసి సూళ్లూరుపేట పోలీసులను ఆదేశించారు. తమ సిబ్బంది ముందు రౌడీ చేతిలో తన్నులు తిన్న దళిత ఆఫీసర్ ఉన్నతాధికారుల ఒత్తిడికి లొంగి తనను కొట్టిన రౌడీని వదిలిపెట్టాల్సి వచ్చింది.

చట్టబద్దంగా పనిచేస్తున్నామని చెప్పగలరా డీజీపీ?

పోలీసు వ్యవస్థను చట్టబద్ధంగా నడిపిస్తున్నామని చెప్పే ధైర్యం ఉందా డీజీపీ? ఎన్.ఆర్.ఐ లు ఈ ఏపీ మాకొద్దు అని పెనమలూరు నుండి పారిపోయారు. దీనిపై పోలీసులు ఏం సమాధానం చెబుతారు? పోలీసు వ్యవస్థ ఉన్నట్టా?

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య పోలీసులా వ్యవహరించాడా? మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి పరిస్థితి ఏంటి? అధికారపార్టీకి బానిసత్వం వహించలేదా? ప్రస్తుతం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి, పూర్వపు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లు ఏ విధంగా వ్యవహరించారు?

హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టినవారిపై చర్యలేవి డీజీపీ?

వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై ఒక్క కేసు అయినా పెట్టారా? ఏపీ పోలీసులు సమాధానం చెప్పగలరా? టీడీపీ పోస్టులుపై మాత్రమే కేసులు పెట్టడం ఏంటి డీజీపీ? హైకోర్టు జడ్జిలను కూడా వైసీపీ సోషల్ మీడియాలో తిడితే ఏపీ పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. సీఐడీ కూడా ఈ కేసును తేల్చలేక పారిపోయింది. దీనికి కారణం ఎవరు డీజీపీ? ఏపీ పోలీసుల పనితీరుపై హైకోర్టు జడ్జిలు కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితిని తెచ్చారు.

  • Loading...

More Telugu News