BJP: వీడిన జనగామ బీజేపీ నేత తిరుపతిరెడ్డి అదృశ్యం కేసు!
- భూతగాదాల నేపథ్యంలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ముక్కెర తిరుపతిరెడ్డి
- విజయవాడలో గుర్తించిన పోలీసులు.. హైదరాబాద్ కు తరలింపు
- మైనంపల్లి భయంతో తాను విశాఖ, విజయవాడలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత
జనగామ నియోజకవర్గం బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి అదృశ్యం కేసు ఎట్టకేలకు వీడింది. భూతగాదాల విషయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అనుచరులు కలిసి తన భర్తపై కుట్ర చేశారని తిరుపతిరెడ్డి భార్య ఆరోపణలు గుప్పిస్తూ, అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తన భర్త అచూకీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి రెడ్డి విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆయనను హైదరాబాద్ తరలించారు.
మైనంపల్లి హన్మంతరావు తన అనుచరులతో తనను చంపించాలని ప్రయత్నించారని, మైనంపల్లి తనకు ఎనిమిదిసార్లు ఫోన్ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ భయంతో తాను విశాఖ, విజయవాడ వెళ్లినట్లు చెప్పారు.
కాగా, తన భర్త కిడ్నాప్ కు గురయ్యారంటూ తిరుపతిరెడ్డి భార్య సుజాత గురువారం రాత్రి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత న్యాయం చేయాలని అక్కడే బైఠాయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. చివరకు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు.
ఓల్డ్ అల్వాల్ లోని 566, 568ఆ, 571అ సర్వే నెంబర్ల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన స్థలం పంపకాల్లో తిరుపతిరెడ్డికి, జనార్దన్ రెడ్డికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ భూవివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని, తన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని తిరుపతిరెడ్డి గతంలో ఆరోపించారు. ఇదే సమయంలో ఆయన అదృశ్యం చర్చనీయాంశంగా మారింది.