Yamuna: ఉప్పొంగుతున్న యమునా నది.. 45 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ ను తాకిన వరద.. వీడియో ఇదిగో

Yamuna river flood touches Taj Mahal

  • ఆగ్రాలో 495.8 అడుగులకు చేరిన యమున నీటిమట్టం
  • తాజ్ వెనకున్న తోటను ముంచెత్తిన వరద నీరు
  • ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయం గర్భగుడిలోకి చేరిన వరద

భారీ వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆగ్రాలో నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. ఈ క్రమంలో చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ గోడలను యమున తాకింది. తాజ్ మహల్ ను యమున వరద తాకడం 45 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. 1978లో వరదలు వచ్చిన సమయంలో తాజ్ ను యమున తాకింది. తాజ్ మహల్ వెనకున్న తోటను యమున వరదనీరు ముంచెత్తింది. 

ఈ సందర్భంగా ఆగ్రా సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందిస్తూ... తాజ్ కాంప్లెక్ బయటి గోడలను యమున తాకిందని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇది జరిగిందని అన్నారు. అయితే తాజ్ స్మారక చిహ్నంలోకి వరద నీరు ప్రవేశించే అవకాశం లేదని చెప్పారు. మరోవైపు వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది.

  • Loading...

More Telugu News