Gujarat: వీధుల్లోకి వరద.. గుజరాత్ లో నీట మునిగిన వాహనాలు.. వీడియో ఇదిగో!
- నదీ ప్రవాహాలను తలపిస్తున్న సూరత్ రోడ్లు
- రాజ్ కోట్, గిర్ సోమ్ నాథ్ లనూ ముంచెత్తిన వాన
- 14 గంటల్లో 34.5 సెం.మీ. వర్షపాతం రికార్డు
దక్షిణ గుజరాత్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నగరాలలో లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు చేరాయి. వీధుల్లో ఎటుచూసినా వరద నీళ్లు.. అందులో మునిగిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా రాజ్ కోట్, సూరత్, గిర్ సోమ్ నాథ్ జిల్లాలను వరద ముంచెత్తింది.
గిర్ సోమ్ నాథ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటల వరకు కేవలం 14 గంటల్లో 34.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాజ్ కోట్ జిల్లాలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. జిల్లాలో కేవలం రెండు గంటల వ్యవధిలో 14.5 సెం.మీ. వర్షపాతం రికార్డయిందన్నారు.
రాష్ట్రంలోని 206 రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోందని అధికారులు తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది.