Raja Singh: ఈటలతో భేటీ అనంతరం... పార్టీ మార్పుపై రాజాసింగ్ ఏం చెప్పారంటే..!
- గోషామహల్ బీజేపీ కార్యకర్తలపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆరోపణ
- కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఈటల రాజేందర్ వచ్చారన్న రాజాసింగ్
- తన సస్పెన్షన్‌పై ఈటలతో చర్చించలేదన్న గోషామహల్ ఎమ్మెల్యే
గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు, కార్పోరేటర్‌పై అధికార బీఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని, ఈ విషయాన్ని తాము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. పోలీసులు దౌర్జన్యం చేస్తుండటంతో బీజేపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఈటల ఈ రోజు తన వద్దకు వచ్చారని చెప్పారు. కార్యకర్తలు, కార్పోరేటర్ కుటుంబ సభ్యులతో ఈటల మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. కార్యకర్తలకు ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారన్నారు. చాలారోజులుగా తామిద్దరం కలవాలనుకుంటున్నామని, కానీ ఇప్పుడు ఈటల స్వయంగా వచ్చారన్నారు.
తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కానీ అంతకుముందు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాత్రం కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని తెలిపారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్తాననే వార్తలను రాజాసింగ్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు తదితరులందరినీ కలుస్తానని చెప్పారు. కానీ పార్టీ మారేది లేదన్నారు.
అసలేం జరిగిందంటే..
నియోజకవర్గంలో జరిగిన వివాదం గురించి రాజాసింగ్ చెబుతూ... ఈ నెల 13న చిన్న బ్యానర్ విషయంలో గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వివాదం చెలరేగిందని, ఇది చాలా పెద్దదిగా మారిందని తెలిపారు. ఈ ఘటనలో తమ కార్యకర్తకు గాయాలయ్యాయని, ఏడెనిమిది కుట్లు పడ్డాయని, ఇదే విషయమై అడగడానికి వెళ్లిన వారిని కూడా కొట్టినట్లు చెప్పారు.
అయితే ఇక్కడ పోలీసులు దాడి చేసిన వారిపై కాకుండా.. దాడికి గురైన బాధితులపై కేసులు పెట్టారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని, ప్రస్తుతం వారు అందుబాటులో లేరని, బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపై, కార్పోరేటర్లపై పోలీసులు, ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్ ను గెలవాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలను, కార్పోరేటర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.