Telangana: తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
- తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి
- తొమ్మిది గంటలకు సెలవు ప్రకటించడంపై పేరెంట్స్ ఆగ్రహం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు, రేపు సెలవు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. కాగా, మంత్రి ట్వీట్ పై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు ఉదయం ఏడు గంటలకి ప్రారంభమైతే 9 గంటలకు సెలవు ప్రకటించడం ఏంటని విద్యాశాఖ మంత్రి సబితను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు.
చాలామంది విద్యార్థులు ఇప్పటికే వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్లారని తల్లిదండ్రులు ఆగ్రహంతో ట్వీట్ చేశారు. ఉదయం 7:30 గంటలకు వర్షంలో తడుస్తూనే పిల్లలను స్కూల్ లో దింపేసి వచ్చామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మీరు తీరిగ్గా 9 గంటలకు స్కూళ్లకు సెలవంటూ ట్వీట్ చేస్తే ఏంలాభమని నిలదీస్తున్నారు. వర్షాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం లేదని పేరెంట్స్ విమర్శిస్తున్నారు.