Tomato: టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. జనం ఎత్తుకెళ్లకుండా డ్రైవర్ కాపలా
- హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఘటన
- గాయం బాధిస్తున్నా వాటికి కాపలాగా ఉన్న డ్రైవర్
- మరో లారీ వచ్చాక అందులోకి ఎక్కించి తీసుకెళ్లిన వైనం
- మిగిలిన వాటి కోసం దారినపోయే వారి మధ్య పోటీ
- కిలో రూ. 150 పైనే పలుకుతున్న టమాటా ధర
టమాటాలతో వెళ్తున్న లారీ బోల్తా పడితే జనం ఊరుకుంటారా?.. వెంటనే వెళ్లి అందినకాడికి ఇంటికి మోసుకెళ్తారు. ఒకప్పుడు అయితే పట్టించుకునేవారు కాదేమో కానీ, ఇప్పుడు మాత్రం వాటిని బంగారంలా చూస్తున్నారు. ధరలు ఆకాశాన్ని తాకడమే అందుకు కారణం. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కేజీ టమాటాల ధర రూ. 150 పైనే పలుకుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే హనుమకొండ జిల్లా ఆత్మకూరు శివారులోని జాతీయ రహదారిపై టమాటాలు, ఇతర కూరగాయలతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. లారీ బోల్తా పడడంతో అందులోని కూరగాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో గాయం బాధిస్తున్నా డ్రైవర్ వాటికి కాపలా ఉన్నాడు.
టమాటాలను ఎవరూ ఎత్తుకుపోకుండా బాధను అనుభవిస్తూ కాపలా కాస్తూనే వాటిని తీసుకెళ్లేందుకు మరో వాహనం కోసం ఫోన్ చేశాడు. అది వచ్చాక కూరగాయలను అందులోకి ఎక్కించి తీసుకెళ్లాడు. మరికొన్ని టమాటాలు అక్కడే ఉండిపోవడంతో వాటిని తీసుకునేందుకు పక్కనే పొలాల్లో ఉన్న రైతులు, రోడ్డున పోయేవారు పోటీపడ్డారు.