G. Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శంషాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు
- బాటసింగారంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తుండగా అడ్డగింత
- ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే వాహనాలు అడ్డుపెట్టి కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
- వర్షంలో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కిషన్ రెడ్డి, రఘునందన్
రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు. తమ వాహనాలను అడ్డుగా పెట్టి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను మధ్యలోనే అడ్డగించిన రాచకొండ సీపీ నేతృత్వంలోని పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడంపై కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రిని అయిన తనను ఎలా అడ్డుకుంటారని సీపీ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. రఘునందన్, ఇతర నేతలతో కలిసి వర్షంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. బాటసింగారం వెళ్లి తీరుతానని చెప్పారు. అయితే, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.