Hyderabad: అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ మేయర్
- హైదరాబాద్ లో కుండపోత.. ట్రాఫిక్ జామ్, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మేయర్ విజయలక్ష్మి, కమిషనర్
- సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9000113667 ను సంప్రదించాలి
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోవడం వంటి తదితర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9000113667 ను సంప్రదించాలని అధికారులకు సూచించారు.
కాగా, హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాల నుండి ఇంటికి బయలుదేరే సమయంలో వర్షం రావడంతో వాహనదారులు ఫ్లై ఓవర్, భవనాల కింద తలదాచుకున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి తదితర చాలాచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదయింది. సాధారణంగా జులై 20వ తేదీ నాటికి హైదరాబాద్ లో సగటున 101.2 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 122.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వారం చివరి వరకు వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.