Ayodhya Ram Mandir: జనవరిలో విగ్రహ ప్రతిష్ఠాపన.. అయోధ్య హోటళ్లకు అప్పుడే డిమాండ్
- రాముడి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని అంచనా
- ఢిల్లీ, ముంబై, తదితర మెట్రో నగరాల నుండి అప్పుడే ముందస్తు బుకింగ్స్ కోసం ఫోన్లు
- జిల్లాలో మొత్తం 10,000 గదులతో 150 హోటల్స్ సిద్ధం
రామజన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగర హోటళ్లలో ట్రావెల్ ఏజెంట్లు, భక్తులు ముందుగానే గదులను బుక్ చేసుకుంటున్నారు. శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న విగ్రహప్రతిష్ఠాపన జనవరి 15 నుండి జనవరి 24 మధ్య ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే కచ్చితమైన తేదీ తెలియాల్సి ఉంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని నగరంలోని హోటల్స్ యజమానులు, రిసార్ట్ యజమానులు అంచనా వేస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ బుధవారం అయోధ్యలోని హోటల్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవిత్ర కార్యక్రమం సందర్భంగా అతిథులకు స్వాగతం పలికేందుకు తమ హోటళ్లను అలంకరించాలని వారిని కోరారు.
ఢిల్లీ, ముంబై, తదితర మెట్రో నగరాల నుండి పదిహేను రోజుల పాటు తమకు గదులు కావాలని ఇప్పటికే ఫోన్ కాల్స్ వస్తున్నాయని అయోధ్యలోని ప్రముఖ హోటల్ షాన్-ఇ-అవద్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కపూర్ తెలిపారు. బాంబే ట్రావెల్ ఏజెన్సీ నుండి 1,500 గదుల కోసం తమకు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ప్రతిష్ఠాపన కచ్చితమైన తేదీ తెలియకపోవడం సమస్యగా మారిందని సంగ్రామ్ సింగ్ అనే రిసార్ట్ యజమాని చెప్పారు. భక్తుల తాకిడి ఉండనున్న నేపథ్యంలో పేయింగ్ గెస్ట్ పథకం కింద 41 మంది భవన యజమానులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పంపిణీ చేశారు.
ఫైజాబాద్, అయోధ్యలలో 10 విలాసవంతమైన హోటళ్లు, 25 బడ్జెట్ హోటళ్లు, 115 ఎకానమీ హోటళ్లు, 35 గుర్తింపు లేని గెస్ట్ హౌస్‌లు, 50 ధర్మశాలలు, 50 హోమ్‌స్టే/పేయింగ్ గెస్ట్ హౌస్‌లు, జిల్లాలో మొత్తం 10,000 గదులతో దాదాపు 150 హోటళ్లు ఉన్నాయి. అదనంగా, నాలుగు ప్రభుత్వ అతిథి గృహాల్లో సుమారు 35 గదులు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 50 చిన్న గెస్ట్ హౌస్‌లు నవంబర్ నాటికి సిద్ధం కానున్నాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది జనవరి 24న 10 రోజుల పాటు నిర్వహించే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ఆలయాన్ని భక్తుల కోసం తెరిచే అవకాశం ఉందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా గత నెలలో తెలిపారు. మూడు అంతస్తుల రామాలయం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయని, జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించినట్లు మిశ్రా తెలిపారు.