USA: అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు..యువతి పరిస్థితి విషమం
- యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో చదువుకుంటున్న సుశ్రూణ్య కోడూరు
- స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా పిడుగుపాటు
- పక్కనే ఉన్న కొలనులో పడిపోయిన విద్యార్థిని
- 20 నిమిషాల పాటు గుండె లయతప్పడంతో మెదడుకు డ్యామేజ్
- చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని
- యువతి వైద్య ఖర్చుల కోసం ‘గోఫండ్మీ’ పేజ్ ఏర్పాటు
అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. బాధితురాలు సుశ్రూణ్య కోడూరు(25) యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జులై మొదటివారంలో ఆమె తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా పిడుగుపడింది. దీంతో, ఆమె కొలనులో పడిపోయింది.
ఈ క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు గుండె లయతప్పడంతో సుశ్రూణ్య మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్ కొత్త పేర్కొన్నారు. విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్మీ' ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.