G. Kishan Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Kishan Reddy visits Charminar Bhagyalakshi Temple

  • అభిమానులు ఇచ్చిన ఖడ్గం ఎత్తి చూపిన కేంద్ర మంత్రి
  • కిషన్ రెడ్డి వెంట ఈటల రాజేందర్, రఘునందన్ రావు
  • నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న కిషన్ రెడ్డి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర నేతలతో వచ్చిన కిషన్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఓ కార్యకర్త ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన చార్మినార్ ముంగిట ఎత్తి చూపెట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఈ ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు,  తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News