Prabhas: రామ్‌ చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తా: ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

prabhas says he is doing a film with ramcharan prabhas for sure
  • అదరగొడుతున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ 
  • శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్లో రిలీజ్
  • రామ్‌చరణ్‌ తనకు మంచి స్నేహితుడన్న ప్రభాస్
  • ఏదో ఒక రోజు తామిద్దరం కలిసి సినిమా చేస్తామని వెల్లడి
‘గ్లోబల్ స్టార్’ ప్రభాస్ కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ ప్రభంజనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘బాహుబలి, ఆదిపురుష్‌, సాహో, సలార్‌, ఇప్పుడు కల్కి 2898 ఏడీ.. ఇలా భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో బ్లూ స్క్రీన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.. మీకు వాటిని చూసి బోర్‌ కొట్టడంలేదా?’ అనే ప్రశ్నకు ప్రభాస్‌ బదులిస్తూ.. మొదట్లో తనకు చాలా బోర్‌ కొట్టిందని చెప్పారు. అంత పెద్ద బ్లూ స్క్రీన్‌ ముందు తాను చాలా చిన్నగా కనిపించేవాడినని, కానీ గ్లింప్స్‌ చూశాక ఆనందం వేసిందని అన్నారు.

రాజమౌళి, రామ్ చరణ్‌ గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చాలా గొప్ప సినిమా. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు” అని చెప్పారు. 

‘‘రామ్‌చరణ్‌ నాకు మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్‌, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తే అది భారీ మల్టీస్టారర్‌ అవుతుందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌, కోలీవుడ్‌ అగ్ర నటుడు కమలహాసన్‌, దీపికా పదుకొణె తదితరులు నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas
Kalki 2898 AD
Comic Con
Nag Ashwin
Amitabh Bachchan
Kamal Haasan
Ramcharan
Rajamouli

More Telugu News