Pawan Kalyan: పవన్ తగ్గేదేలే.. వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి ప్రశ్నల వర్షం!
- పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న పవన్
- వాలంటీర్ల బాస్ ఎవరని ప్రశ్న
- ప్రైవేటు డేటాను సేకరించమని ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత వెనక్కి తగ్గడం లేదు. ఏపీ ప్రభుత్వం తనపై కేసులు నమోదు చేస్తున్నా.. తన ప్రశ్నలను మాత్రం ఆపడం లేదు. తనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘‘పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. వాలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? వాలంటీర్ల వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? లేదా అది ఏపీ ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎంనా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?” అని నిలదీశారు. ప్రధానమమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రి కార్యాలయాన్ని పవన్ ట్యాగ్ చేశారు.
మరోవైపు ‘జనసేన శతఘ్ని’ టీమ్ షేర్ చేసిన ట్వీట్‌ను పవన్ రీట్వీట్ చేశారు. ‘‘ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత. డేటా లీకేజీ అంశంపై పవన్ కల్యాణ్ నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడం మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైసీపీపై తిరుగుబాటు మొదలు పెడతారు. సిద్దంగా ఉండు జగన్” అని అందులో పేర్కొన్నారు. ఓ వాలంటీర్‌ను ఒకరు నిలదీస్తున్న వీడియోను తమ ట్వీట్‌కు శతఘ్ని టీమ్ జత చేసింది.