Mamata Banerjee: కారులో ఆయుధాలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇంట్లోకి చొరబడే యత్నం!
- కాళీఘాట్ లోని మమతా బెనర్జీ నివాసంలోకి చొచ్చుకెళ్లే యత్నం
- భద్రతా సిబ్బంది అడ్డుకొని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు
- అరెస్టైన వ్యక్తిని నూర్ ఆలంగా గుర్తించిన పోలీసులు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలోకి కారులో ఆయుధాలతో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నల్లకోటు, టై ధరించిన అతను పోలీస్ స్టిక్కర్ తో కూడిన కారులో ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. అతనిని నూర్ ఆలంగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు మమతా బెనర్జీ తన ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు.
అరెస్టైన వ్యక్తి వద్ద ఆయుధాలు, గంజాయి దొరికాయని, బీఎస్ఎఫ్ సహా పలు ఏజెన్సీలకు చెందిన గుర్తింపు కార్డులను అతను కలిగి ఉన్నాడని చెప్పారు. భద్రతా సిబ్బంది అడ్డుకొని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడన్నారు. అతను ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాడని, ఇది తీవ్రమైన అంశమని, అతని అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని గోయల్ వెల్లడించారు. అతని కారును స్వాధీనం చేసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తన కాళీఘాట్ నివాసం నుండి నగరంలోని సెంట్రల్ ప్రాంతంలోని అమరవీరుల దినోత్సవం ర్యాలీ వేదికకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది.