Mamata Banerjee: ప్రధాని కావాలనే కోరిక లేదు: మమతా బెనర్జీ
- బీజేపీని గద్దె దించడమే తన లక్ష్యమన్న మమత
- బీజేపీని ఇండియా కూటమి ఓడిస్తుందన్న దీదీ
- మణిపూర్ కు కేంద్ర బలగాలను ఎందుకు పంపించలేదని ప్రశ్న
విపక్షాల కూటమి ఇండియా తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండొచ్చనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పీఎం పదవి తమకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇదే అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ... తనకు పీఎం కావాలనే కోరిక లేదని చెప్పారు. బీజేపీని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ కు కేంద్ర బలగాలను పంపలేదని మమత విమర్శించారు. పంచాయతి ఎన్నికల తర్వాత ఎన్నో కేంద్ర బలగాలను పశ్చిమబెంగాల్ కు పంపించారని విమర్శించారు. బీజేపీని ఇండియా కూటమి కచ్చితంగా ఇంటికి పంపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.