gyanvapi: జ్ఞాన్ వాపి మసీదులో సర్వేకు కోర్టు అనుమతి
- ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో మసీదు ప్రాంగణం సర్వేకు ఓకే
- హిందూ ప్రతినిధుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వెల్లడి
- ఆగస్ట్ 4న శాస్త్రీయ నివేదికను సమర్పించాలని ఆదేశం
వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్థానిక కోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా మసీదు ప్రాంగణం మొత్తాన్ని సర్వే చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే మసీదు ప్రాంగణంలోని వాజుఖానాను మాత్రం సర్వే నుండి మినహాయించింది. ఆగస్ట్ 4న శాస్త్రీయ నివేదికను సమర్పించాలని ASIని ఆదేశించింది. జ్ఞాన్ వాపిలో సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఇప్పుడు అనుమతించినట్లు హిందూ ప్రతినిధుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు.
జ్ఞాన్ వాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ మేరకు వారణాసి కోర్టు ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియో గ్రఫీ సర్వేకు అనుమతినిచ్చింది. సర్వే సమయంలో అక్కడ శివలింగం కనిపించిందని హిందూ పక్షం వేసిన పిటిషన్ పైన స్పందించిన కోర్టు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని, సీఆర్పీఎఫ్ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ తర్వాత ఇది సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రాంతానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు సున్నితత్వం దృష్ట్యా సీనియర్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. కేసు విచారణ జరుగుతుండగా భక్తులు మరో పిటిషన్ దాఖలు చేశారు. మసీదు ప్రాంగణమంతా ASIతో సర్వే చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే అలాంటి సర్వేతో మసీదు ప్రాంగణం ధ్వంసమయ్యే అవకాశముందని ముస్లింలు వాదించగా, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నేడు కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు సీజ్ చేసిన ప్రాంతం మినహా మిగతా మసీదు ప్రాంగణం శాస్త్రీయ సర్వేకు అనుమతించింది.