Nara Lokesh: కమ్మ సమాజాన్ని జగన్ టార్గెట్ చేశాడు: లోకేశ్
- కనిగిరి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- ఎర్రఓబునపల్లిలో కమ్మ సామాజిక వర్గీయులతో లోకేశ్ భేటీ
- పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండవన్న లోకేశ్
- చంద్రబాబు ఏనాడూ ఓ కులాన్ని దూషించలేదని వెల్లడి
- జగన్ హిట్లర్ లా కమ్మవారిపై కక్షగట్టాడని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 161వ రోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసంద్రాన్ని తలపించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి పెద్దారికట్ల శివార్లలో మార్కాపురంలోకి ప్రవేశించిన పాదయాత్రకు కనీవినీ ఎరుగనిరీతిలో ఘనస్వాగతం లభించింది. మార్కాపురం ఇన్ చార్జి కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతించారు.
అంతకుముందు, కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్రకు బయలుదేరే ముందు ఎర్రఓబునపల్లి క్యాంప్ సైట్ లో కమ్మ సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.
కమ్మ సామాజిక వర్గీయులతో సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...
జగన్ కమ్మవారిపై కక్షగట్టాడు
హిట్లర్ యూదులను టార్గెట్ చేసినట్లుగా జగన్ కమ్మ సామాజికవర్గంపై కక్షగట్టాడు. కమ్మవారిని ఒక సామాజికవర్గానికి బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీఆర్, చంద్రబాబు ఏనాడూ ఒక కులాన్ని దూషించలేదు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరినీ అభివృద్ది చెయ్యడం టీడీపీ లక్ష్యం.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం నిధులు కేటాయించి, కమ్మ సామాజికవర్గంలో ఉన్న పేదలను ఆదుకుంటాం. 160 రోజులుగా అన్ని సామాజికవర్గాల ప్రజలను కలిశాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వైశ్య, బలిజ, బ్రాహ్మణ, రెడ్డి ఇలా అన్ని సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి కష్టాలు తెలుసుకున్నాను. అందులో భాగంగానే కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో కనిగిరిలో సమావేశం ఏర్పాటు చేశాం.
జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు. అలాంటి చిల్లర రాజకీయం మేం ఎప్పుడూ చెయ్యలేదు.
కమ్మ వారిపై కావాలనే తప్పుడు ప్రచారం
కేవలం అణచివేత కుట్రతోనే కమ్మ సామాజికవర్గంపై జగన్ విషం చిమ్ముతున్నాడు. టీడీపీ హయాంలో 37 మందిలో 35 మంది కమ్మ సామాజికవర్గం వారికి ప్రమోషన్లు ఇచ్చారని జగన్ గల్లీ నుండి ఢిల్లీ వరకూ అసత్య ప్రచారం చేశాడు. గవర్నర్ కి, రాష్ట్రపతికి అబద్ధాలు చెప్పిన వ్యక్తి జగన్.
టీడీపీ హయాంలో ప్రమోషన్లు పొందిన 37 మంది డీఎస్పీల్లో కేవలం ఐదుగురు మాత్రమే కమ్మ సామాజికవర్గం వారు. మిగిలిన వాళ్లలో ఎక్కువ ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన వారే ఉన్నారు.
చంద్రబాబు రాముడు, రాజనీతి పాటిస్తారు. అందుకే అనేక అసత్య ఆరోపణలు చేసినా కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. నేను మాత్రం అలా కాదు... ఎవరినీ వదిలిపెట్టను. అసత్య ఆరోపణలు చేసిన అందరి పైనా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా పోరాడతాను.
ఆయనది ఫ్యాక్షన్ మెంటాలిటీ!
జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ. జైలుకి వెళ్ళిన జగన్ కి సమాజంలో ఉన్న అందరినీ జైలుకి పంపాలి అనేది ఓ కోరిక. అందుకే అందరిపై అక్రమ కేసులు పెడుతున్నాడు. ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డిపై 65 కేసులు పెట్టారు.
సన్న బియ్యం సన్నాసి నా తల్లిని అవమానిస్తే జగన్ రాక్షస ఆనందం పొందాడు. కనీసం అతన్ని తప్పు అని అడ్డుకోలేదు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వాడు జగన్. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తాడా?
అమరావతిపై నాలుక మడతేశాడు!
రాజధాని గురించి నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండాలి, 30 వేల ఎకరాలు ఉండాలి అని మాట్లాడాడు. అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పి, మడమ తిప్పాడు. మూడు రాజధానులు అంటూ విశాఖని క్రైం క్యాపిటల్ గా మార్చేశాడు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. కర్నూలులో ఒక్క ఇటుక పెట్టలేదు.
అమరావతికి భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ ఎస్సీలు ఉన్నారు. 4 ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో అమరావతి విస్తరించి ఉంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, పింక్ డైమండ్, 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. ఒక్క ఆరోపణ జగన్ నిరూపించలేకపోయాడు.
16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ కి... చంద్రబాబుని, నన్ను ఒక్క రోజైనా జైలులో పెట్టాలనే ఆశ ఉంది.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2136.7 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 16.4 కి.మీ.*
*162 వరోజు (22-7-2023) పాదయాత్ర వివరాలు*
*మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*
సాయంత్రం
4.00 – పొదిలి శివారు పోతవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – పోతవరంలో వైసీపీ ప్రభుత్వ బాధితులతో సమావేశం.
4.55 – పొదిలి 4వవార్డులో స్థానికులతో సమావేశం.
6.00 – పొదిలి పాతబస్టాండు సెంటర్ లో బహిరంగసభ, లోకేశ్ ప్రసంగం.
8.00 – కాటూరివారిపాలెంలో స్థానికులతో సమావేశం.
11.00 – తళ్లమల విడిది కేంద్రంలో బస.
******