USA: రోగనిర్ధారణలో పొరపాట్లు..అమెరికాలో ఏటా 8 లక్షల మంది మృతి
- జాన్స్ హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తాజా అధ్యయనంలో వెల్లడి
- డయాగ్నస్టిక్ పరీక్షల నిర్వహణలో పొరపాట్లు
- పొరపాట్ల కారణంగా 3,71,000 మరణం, 4,24,000 మంది శాశ్వతంగా రోగగ్రస్తం
- లంగ్ క్యాన్సర్, సెప్పిస్, స్ట్రోక్ వంటి రోగాల నిర్ధారణలో అధికంగా పొరపాట్లు
అమెరికా అంటే అగ్రరాజ్యం.. అత్యాధునిక వైద్య సదుపాయాల ఆలవాలం. కానీ, రోగనిర్ధారణలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా ఏటా అక్కడ 8 లక్షల మంది మరణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. జాన్స్ హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
వైద్య పరీక్షల సందర్భంగా రోగనిర్ధారణలో పొరపాట్ల కారణంగా ఏటా సగటున 3,71,000 మంది మరణిస్తుండగా, 4,24,000 మంది శాశ్వతంగా రోగగ్రస్తమైపోతున్నారని అధ్యయనం తేల్చింది. మెదడు దెబ్బతినడం, అంధత్వం, అవయవాలు కోల్పోవడం, క్యాన్సర్ శరీరమంతటా విస్తరించడం వంటి తీవ్ర సమస్యల బారిన పడుతున్నట్టు తేలింది. సగానికిపైగా కేసుల్లోని సమస్యలు కేవలం 15 వ్యాధుల వల్లే ఉత్పన్నమవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, పరిష్కారం సులభమేనని అక్కడి నిపుణులు చెబుతున్నారు.
‘‘మన వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రోగనిర్ధారణలో పొరపాట్లే’’ అని జాన్ హాప్‌కిన్స్ డయాగ్నస్టిక్ ఎక్సెలెన్స్ సెంటర్ డైరెక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ పేర్కొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్తంలో ఇన్ఫెక్షన్(సెప్పిస్), సిరల్లో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ వంటి రోగాల నిర్ధారణలో 38.7 శాతం పొరపాట్లు జరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీటి వల్ల తీవ్రసమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.