Manipur: మణిపూర్ హింస.. 6 వేల కేసుల నమోదు
- రాష్ట్రంలో శాంతి నెలకొల్పడమే లక్ష్యం..
- 16 జిల్లాల్లో సగం జిల్లాలు సమస్యాత్మకమే
- తీవ్ర నేరాలపై వెంటనే విచారణ జరుపుతున్నామన్న ఉన్నతాధికారులు
మణిపూర్ హింసాత్మక ఆందోళనలకు సంబంధించి అన్ని ఘటనలపైనా దృష్టి సారించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసపై ఇప్పటి వరకు 6 వేల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మే 3 న మొదలైన హింస.. తదనంతరం జరిగిన దారుణాలకు సంబంధించి సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినవేనని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారే వదంతులతో ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడానికి గట్టి నిఘా పెట్టామని చెప్పారు.
మణిపూర్ లో మహిళల నగ్న ఊరేగింపు ఘటన కూడా ఇలాంటి వదంతుల వల్లే జరిగిందని అధికారులు చెప్పారు. తమ వర్గానికి చెందిన మహిళపై మరో వర్గం వారు అత్యాచారం చేశారని ప్రచారం జరగడంతో రెచ్చిపోయిన జనం మూకుమ్మడిగా దాడులు జరిపి మహిళలపై దారుణాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, క్రాస్ చెక్ చేసి నిజంగా జరిగిన ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. మొత్తం 16 జిల్లాల్లో ఇప్పటికీ సగం జిల్లాలు సమస్యాత్మకంగానే ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో పాటు ఆర్మీ బలగాలను మోహరించి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టామని వివరించారు.