Swati Maliwal: ఎందుకక్కడ కూర్చోవడం దండగ.. జాతీయ మహిళా కమిషన్ చీఫ్‌పై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలీవాల్ ఫైర్
- రేఖాశర్మపై విరుచుకుపడిన స్వాతీమలీవాల్
- 38 రోజుల క్రితం ఫిర్యాదు అందుకున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీత
- మణిపూర్‌లో అమానవీయ ఘటనలు జరుగుతున్నా ఎందుకు పర్యటించలేదని ప్రశ్న
- మహిళల నగ్న ఊరేగింపుపై తమకు ఫిర్యాదు అందలేదన్న రేఖాశర్మ
జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్యంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై 38 రోజుల క్రితమే ఫిర్యాదులు అందినప్పటికీ ఈ రోజు వరకు జాతీయ మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ మాత్రం దానికి అక్కడ కూర్చోవడం దేనికంటూ మండిపడ్డారు. బాధిత మహిళలను పరామర్శిస్తానని, వారేమైనా కౌన్సెలింగ్, న్యాయ సహకారం, పరిహారం కానీ అందుకున్నారా? లేదా? తెలుసుకునేందుకు మణిపూర్‌లో పర్యటించబోతున్నట్టు మణిపూర్ డీజీపీకి లేఖ రాసినట్టు తెలిపారు.
మణిపూర్ ఘటనలపై రేఖాశర్మ నిన్న మాట్లాడుతూ.. అక్కడ జరుగుతున్న హింసపై తాను గత మూడు నెలల్లో మూడుసార్లు అధికారులను సంప్రదించినా వారి నుంచి తనకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జూన్ 12న తమకు ఫిర్యాదు అందినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలను ఆమె కొట్టిపడేశారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత తామే ఈ కేసును సుమోటోగా తీసుకున్నట్టు వివరించారు.
రేఖాశర్మ వ్యాఖ్యలపై మలీవాల్ స్పందిస్తూ.. మణిపూర్‌లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా జాతీయ మహిళా కమిషన్ ఇప్పటి వరకు అక్కడ ఎందుకు పర్యటించలేదని నిలదీశారు. అధికారులు ఆమెకు స్పందించకుంటే ఆమే వెళ్లొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలోనే ఎందుకు కూర్చుండిపోయారని నిప్పులు చెరిగారు.