Talasani: హైదరాబాద్‌లో భారీ వర్షాలు: వారం పాటు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి తలసాని
- హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తలసాని
- ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూస్తున్నామని వెల్లడి
- అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్న మంత్రి
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే సమాచారం ఉందని తెలిపారు. హుస్సేన్ సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో తలసాని మాట్లాడుతూ.. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని, వాటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అవసరమైతే ఆయా నిర్మాణాలకు నష్టపరిహారం కూడా ఇస్తామని తెలిపారు. నాలాలు అభివృద్ధి చేయడం వల్ల పలు ఇబ్బందులు తప్పాయని తెలిపారు.
నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.