Ginger: మసాలా ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కర్ణాటకలో కేజీ అల్లం రూ.400
- అల్లం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న కర్ణాటక
- 60 కిలోల బస్తా ధర రూ. 11 వేలు
- రానున్న రోజుల్లో మరింత పెరగనున్న ధర
- తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం
దేశంలో కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఓవైపు టమాటా ధరలు జనాలకు షాకిస్తున్నాయి. మరోవైపు అల్లం ధర కూడా జనాలకు ఘాటు పుట్టిస్తోంది. కర్ణాటకలో కేజీ అల్లం ధర రూ. 300 నుంచి రూ. 400 మధ్య ఉంది. మన దేశంలో అల్లం ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అలాంటి ఆ కర్ణాటకలోనే అల్లం ధర ఆకాశాన్నంటడం గమనార్హం. రానున్న రోజులో అల్లం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెపుతున్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం 60 కిలోల అల్లం బస్తా రూ. 11 వేలకు అమ్ముతున్నారు. గత ఏడాది ఇది రూ. 2 వేల నుంచి రూ. 3 వేల మధ్యలో ఉంది. మరోవైపు అల్లం ధరలు భారీగా పెరగడంతో మైసూరు, మల్నాడు జిల్లాల రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ జిల్లాల్లోని రైతులు పెద్ద ఎత్తున అల్లం పంటను పండిస్తారు. కర్ణాటకలో పెరిగిన అల్లం ధరల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉంది.
మరోవైపు మైసూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు హోసూరు కుమార్ మాట్లాడుతూ... ఊహించని విధంగా ఈ స్థాయిలో అల్లం ధర పెరగడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారని చెప్పారు. ఇంకోవైపు అల్లం ధర పెరగడం అల్లం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. అల్లంను దొంగలు ఎత్తుకుపోతున్నారు. తన పొలంలో ఉన్న రూ. 1.8 లక్షల విలువైన అల్లంను దొంగలు ఎత్తుకుపోయారని కర్ణాటకకు చెందిన ఓ రైతు వాపోయాడు. ఏదేమైనప్పటికీ అల్లం ధరలు అమాంతం పెరగడం... మసాలా ప్రియులకు, నాన్ వెజ్ ప్రియులకు ఘాటు వార్త అనే చెప్పుకోవాలి.