YV Subba Reddy: వివేకా హత్య కేసు: సీబీఐపై వైవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు!

yv subba reddy sensational comments on ys viveka murder case
  • కోర్టులను పక్కదారి పట్టించేలా గతంలో సీబీఐ వ్యవహరించిందన్న వైవీ సుబ్బారెడ్డి
  • వివేకా హత్య కేసులో ‘గూగుల్ టేకవుట్’ మొదటి నుంచి ఎందుకు లేదని ప్రశ్న
  • ఆధారాలు లేకనే గూగుల్ టేక్ అవుట్ అని సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని ఆరోపణ
  • వివేకా హత్య వెనుక ఎవరు ఉన్నారనేది కోర్టులు తేలుస్తాయని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వెనుక ఎవరెవరు ఉన్నారనే వాస్తవాలను న్యాయస్థానాలు నిగ్గు తేలుస్తాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని చెప్పారు. ‘‘గూగుల్ టేకవుట్ మొదటి నుంచి ఎందుకు లేదు? మధ్యలో సీబీఐ ఎందుకు బయటికి తీసుకువచ్చింది? న్యాయస్థానాలను పక్కదారి పట్టించేలా గతంలో సీబీఐ వ్యవహరించిందని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఆధారాలు లేకనే గూగుల్ టేక్ అవుట్ అని సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని ఆరోపించారు.

ఇదిలావుంచితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రతిపక్షాలు ఎలా వచ్చినా తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. పవన్ పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని వైవీ అన్నారు. ఎవరో రాసిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని.. వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
YV Subba Reddy
Pawan Kalyan
Chandrababu
Jagan
YS Vivekananda Reddy
viveka murder case
CBI

More Telugu News