Kanna Lakshminarayana: జగన్ దుశ్చర్యల గురించి నాడు తోటిమంత్రులకు చెప్పుకొని వైఎస్ఆర్ వాపోయారు: కన్నా లక్ష్మీనారాయణ
- జగన్ తన స్థాయి మరిచి చౌకబారుగా మాట్లాడుతున్నారన్న కన్నా
- దిగజారుడు విమర్శలు చేయడం ఆయనలోని ఓటమి భయానికి సంకేతమని వ్యాఖ్య
- పసిపిల్లల ముందు బూతులు మాట్లాడే దుస్థితికి వచ్చారని మండిపాటు
- 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి.. ఏ మచ్చా లేని చంద్రబాబుని విమర్శించడమా? అని ప్రశ్న
ఏపీ సీఎం జగన్ తన స్థాయి మరిచి చౌకబారుగా మాట్లాడటం, ఉచ్ఛనీచాలు లేకుండా ప్రతిపక్షనేతలపై దిగజారుడు విమర్శలు చేయడం.. ఆయనలోని ఓటమి భయానికి సంకేతమని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ‘‘గతంలో ఎన్ని పార్టీలు, ఎవరు కలిసి వచ్చినా వెంట్రుక కూడా పీకలేరన్న జగన్.. కేవలం 9 నెలల్లోనే స్వరం మార్చాడు. పసిపిల్లల ముందు బూతులు మాట్లాడే దుస్థితికి వచ్చాడు” అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
“బహిరంగ సభలు, సమావేశాల్లో తానేం మాట్లాడుతున్నాననే ఇంగితం లేకుండా జగన్ తన నోటికి పని చెబుతున్నాడు. తన చీకటి బాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టు గురివింద గింజలా ఇతరుల్ని విమర్శిస్తున్నాడు” అని మండిపడ్డారు. తండ్రి ఆశయాల్ని తుంగలోతొక్కి, యువజన, శ్రామిక రైతుపార్టీ అని పేరుపెట్టి, రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎలా పెడతారని జగన్‌ను ప్రశ్నించారు.
ప్రజలకు చేసిందేమీలేక, చెప్పుకోవడానికి ఏమీలేకనే ఎదుటి వారిపై జగన్ విమర్శలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రజల గురించి ఆలోచించడం, పరిపాలన చేతగాదని తేలిపోయిందని అన్నారు. అందుకే ఎవరు ఏమి అడిగినా బూతులుతప్ప మరోటి వారినోటి నుంచి రావడంలేదన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైపు జగన్ ఒక వేలెత్తి చూపితే, మిగిలిన వేళ్లన్నీ ఆయన బాగోతాల్ని ఎత్తిచూపుతున్నాయని విమర్శించారు. ‘‘వైఎస్సార్ పార్టీ అంటూ, ఆ వైఎస్ ఆత్మక్షోభించేలా సొంత కుటుంబాన్నే వీధిన పడేశాడు. తల్లి, చెల్లి కాలికి బలపం కట్టుకొని జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తిరిగితే, వారిని భయభ్రాంతులకు గురిచేసి హైదరాబాద్ లో తలదాచుకునేలా చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆగడాలు, దుశ్చర్యల గురించి తోటిమంత్రులకు చెప్పుకొని వాపోయారు” అని అన్నారు.
ఇప్పుడు జగన్ పక్కన ఉన్న వాళ్లు.. గతంలో రాజశేఖర్ రెడ్డితో ‘నీలాంటి వాడికడుపున జగన్ పుట్టాల్సింది కాద”ని అనలేదా? అని ప్రశ్నించారు. చెప్పుకుంటూపోతే జగన్ చీకటి బాగోతాలు చాలానే ఉన్నాయని, అవన్నీ ప్రజలకు తెలియవనుకోవడం జగన్ మూర్ఖత్వమేనని అన్నారు.
‘‘16 నెలలు జైలులో ఉండివచ్చిన వ్యక్తి.. ఏ మచ్చాలేని చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు. చంద్రబాబు ముసలివాడని అనిహేళన చేస్తున్న జగన్.. టీడీపీ అధినేతతో ఏ విషయంలో అయినా పోటీపడగలడా? అభివృద్ధిలో గానీ, సంక్షేమ పథకాల అమల్లోగానీ, ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా వారికష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గానీ.. ఏ విషయంలో నైనా జగన్ సరితూగగలడా?” అని కన్నా ప్రశ్నించారు.
‘‘నోరుందని బూతులు మాట్లాడితే.. ప్రజలు ఏదో ఒక రోజు మీ మూట ముల్లే సర్ది బంగాళాఖాతంలో విసిరేస్తారు. జగన్‌కు నిజంగా దమ్ము, ధైర్యముంటే తాను ఇది చేశానని ప్రజలకు చెప్పుకొని, వారి ముందుకెళ్లి ఓట్లు అడగాలి. ఎన్నికలకు వెళ్లడానికి జగన్ ఎంత తహతహ లాడుతున్నాడో.. ఈ సైకో ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడు గోతిలో కప్పెడదామా అని ప్రజలు అంతకంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు” అని కన్నా స్పష్టంచేశారు.