Mohan Bhagwat: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ సేవలను కొనియాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్
- వారణాసిలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం
- 30 దేశాల నుంచి 1,600 మంది ప్రతినిధులు హాజరు
- ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఇటీవల తిరుమల శ్రీవాణి ట్రస్టుపై ఏపీ విపక్షాలు గురిపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎటువెళుతున్నాయంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నుంచి శ్రీవాణి ట్రస్టుపై ప్రశంసల జల్లు కురిసింది.
వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమానికి మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి 30 దేశాల నుంచి 1,600 మంది ప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్టు గురించి ప్రస్తావించారు. దేశంలో చిన్న, మధ్యస్థ దేవాలయాల ఉద్ధరణకు శ్రీవాణి ట్రస్టు అందిస్తున్న సేవలు బాగున్నాయంటూ కితాబిచ్చారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా సేకరించిన నిధులను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు నిర్మిస్తున్న టీటీడీని ఆయన అభినందించారు. ఆలయాల నిర్మాణం ద్వారా హిందూ మత విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోహన్ భగవత్ సూచించారు. ఆలయాలు పేదల విద్యా, వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని పేర్కొన్నారు.