Pawan Kalyan: ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు ఎలా పాల్గొంటారు?: మరోసారి పవన్ ఫైర్
- ఇటీవల వాలంటీర్ వ్యవస్థపై తరచుగా స్పందిస్తున్న పవన్
- ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని తాజాగా ఆరోపణలు
- బీఎల్వోలతో కలిసి వాలంటీర్లు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారని వెల్లడి
- ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. ఓటర్ జాబితాల అంశంలో వాలంటీర్ల జోక్యం ఏంటని మండిపడ్డారు. ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
ఓటర్ల తనిఖీకి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ బూత్ లెవల్ ఆఫీసర్లతో కలిసి వాలంటీర్లు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కోరుతోందని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.