Madhya Pradesh: పొరపాటున తాకిన దళితుడు.. ముఖంపై మానవ విసర్జితాలు చల్లి వికృతానందం
- మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ జిల్లాలో ఘటన
- మగ్గులో విసర్జితాలు తెచ్చి ముఖంపై చల్లిన నిందితుడు
- కులం పేరుతో దూషణ
మధ్యప్రదేశ్‌లో దారుణాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. పొరపాటున తనను తాకిన ఓ దళితుడి ముఖం, శరీరంపై మానవ విసర్జితాలను చల్లాడో వ్యక్తి. చత్తర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోమారు చర్చనీయాంశమైంది. నిందితుడు రామ్‌కృపాల్ పటేల్ ప్రస్తుతం తమ అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
తనపై జరిగిన దారుణంపై బాధితుడు దశరథ్ అహిర్వార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుకౌరా గ్రామంలో పంచాయతీ కోసం శుక్రవారం డ్రెయిన్‌ను నిర్మిస్తున్నప్పుడు పొరపాటున గ్రీజుతో ఉన్న తన చేయి నిందితుడికి తాకినట్టు ఆయన పేర్కొన్నాడు. ఆ వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన పటేల్ సమీపంలో పడి వున్న మానవ వ్యర్థాలను మగ్గులో తీసుకొచ్చి ముఖంపైనా, శరీరంపైనా పోసినట్టు ఆరోపించాడు. అంతేకాకుండా కులం పేరుతో దూషించినట్టు తెలిపాడు.