Manipur Violence: మణిపూర్లో స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం
- మణిపూర్లో దారుణ పరిస్థితులు
- వెలుగులోకి రోజుకో దారుణం
- సమరయోధుడి భార్య ఇంట్లో ఉండగా బయట తాళం వేసి నిప్పు
- మే 28న ఘటన
దాదాపు రెండు నెలలుగా నిత్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో జరిగిన మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధురాలి భార్యను కొందరు దుండగులు సజీవ సమాధి చేశారు. కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులకు అద్దంపడుతోంది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి సత్కారం అందుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్య సోరో కైబామ్ ఇబెటోంబి (80)ని సాయుధ మూక సజీవ దహనం చేసింది. ఈ ఘటన కూడా ఘర్షణలు ప్రారంభమైన మే నెలలో 28వ తేదీన జరిగినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అదే రోజున గ్రామంలో హింస చెలరేగిందని, కాల్పులు కూడా జరిగాయని తెలిపింది.
ఇబెటోంబి ఇంట్లో ఉండగా బయటి నుంచి గడియపెట్టిన దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సరికే ఇల్లు కాలిబూడిదైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు ఆమె మనవడు ప్రేమ్కాంత తెలిపారు. దుండగుల కాల్పుల్లో తన కాలు, చేయిలోకి కొన్ని తూటాలు దూసుకెళ్లినట్టు పేర్కొన్నారు. దుండగులు కాల్పులు జరుపుతుండడంతో తమను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పి తమ ప్రాణాలు కాపాడి ఆమె బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.