Team India: వెస్టిండీస్ తో రెండో టెస్టుకు వరుణుడి ఆటంకం... భారీ ఆధిక్యం దిశగా భారత్
- ట్రినిడాడ్ లో టీమిండియా, వెస్టిండీస్ రెండో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 ఆలౌట్
- విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు కుప్పకూల్చిన భారత బౌలర్లు
- రెండో ఇన్నింగ్స్ లో భారత్ 2 వికెట్లకు 118 పరుగులు
- ఓవరాల్ ఆధిక్యం 301 పరుగులు... ఆటకు నేడు నాలుగోరోజు
వెస్టిండీస్ తో టీమిండియా రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. నాలుగో రోజు ఆటలో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 118 పరుగులు చేసిన స్థితిలో వర్షం పడి మ్యాచ్ నిలిచిపోయింది. శుభ్ మాన్ గిల్ 10, ఇషాన్ కిషన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 98 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేయగా, జైస్వాల్ 38 పరుగులు చేశాడు.
అంతకుముందు, వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన పదునైన బౌలింగ్ తో విండీస్ లైనప్ ను కకావికలం చేశాడు. సిరాజ్ కు 5 వికెట్లు దక్కాయి. కొత్త పేసర్ ముఖేశ్ కుమార్ 2, రవీంద్ర జడేజా 2, అశ్విన్ 1 వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ చేసిన 75 పరుగులే అత్యధికం.
కాగా, తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 183 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.... ఓవరాల్ గా 301 పరుగుల లీడ్ లో నిలిచింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, విండీస్ ముందు 400 పరుగుల టార్గెట్ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.