Team India: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు 8 వికెట్ల దూరంలో టీమిండియా
- రెండో ఇన్నింగ్స్‌ను 181/2 వద్ద డిక్లేర్ చేసిన రోహిత్‌సేన
- వెస్టిండీస్ విజయ లక్ష్యం 365
- 76/2తో పోరాడుతున్న కరీబియన్ జట్టు
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా కేవలం 8 వికెట్ల దూరంలో నిలిచింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులోనూ భారీ విక్టరీపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 181/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
రోహిత్ శర్మ (57) తన టెస్టు కెరీర్‌లో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేయగా.. కీపర్ ఇషాన్ కిషన్ (52 నాటౌట్) కూడా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. నిన్న రాత్రి వర్షం ఆగిన తర్వాత మూడో సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఛేదనకు వచ్చిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ 76/2తో ఎదురీత మొదలు పెట్టింది.కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28), క్రిక్ మెకెంజీ (0)ని అశ్విన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం తేజ్ నరైన్ చందర్ పాల్ (24 బ్యాటింగ్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజైన, సోమవారం భారత్ విజయానికి ఇంకా 8 వికెట్లు అవసరం. వెస్టిండీస్ గెలవాలంటే 289 పరుగులు చేయాలి.