KTR: 47వ పుట్టిన రోజున వాళ్ల జీవితాలను మార్చే నిర్ణయం తీసుకున్న కేటీఆర్
- స్టేట్ హోంలో చదువుతున్న అనాథలకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని వెల్లడి
- పది, ఇంటర్ చదువుతున్న 47 మంది, వృత్తి విద్యాకోర్సులు చేస్తున్న మరో 47 మందికి ల్యాప్‌టాప్, రెండేళ్ల కోచింగ్ ఇప్పిస్తానన్న కేటీఆర్
- అనాథలకు తోచిన సాయం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 47వ జన్మదినం సందర్భంగా అనాథల జీవితాలను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదలు పెట్టిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో పది, ఇంటర్ చదువుతున్న ప్రతిభావంతులైన 47 మంది, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న మరో 47 మంది విద్యార్థులకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని ట్వీట్ చేశారు.
‘మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లోని అనాథ పిల్లలకు సహాయం చేయడానికి అర్థవంతమైన మార్గం గురించి ఆలోచిస్తున్నా. నా 47వ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ చొరవ కింద 10,12వ తరగతుల నుంచి ప్రతిభావంతులైన 47 మంది విద్యార్థులు, వృత్తివిద్యా కోర్సుల నుంచి మరో 47 మందికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ల్యాప్‌టాప్ అందిస్తాను. వారి బంగారు భవిష్యత్తు కోసం అత్యుత్తమ సంస్థ నుంచి 2 సంవత్సరాల నాణ్యమైన కోచింగ్ అందిస్తా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రచారం కోసం డబ్బు వెదజల్లడం కంటే వాళ్లకు నచ్చిన మార్గంలో ఇలాంటి అనాథలను ఆదుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ కోరినట్టుగానే చాలా మంది నాయకులు అనాథలకు తోచిన సాయం చేస్తున్నారు.