Thanikella Bharani: సినిమాల పరంగా అప్పటికీ .. ఇప్పటికీ వచ్చిన తేడా ఇదే!: తనికెళ్ల భరణి
- రచయితగా ఇండస్ట్రీకి వచ్చానని చెప్పిన భరణి
- నటుడిగా వరుస సినిమాలు చేశానని వెల్లడి
- ఒకే రకమైన పాత్రలను చేయడం తగ్గించానని వ్యాఖ్య
- డిఫరెంట్ రోల్స్ మాత్రమే చేస్తున్నానని వివరణ
రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా తనికెళ్ల భరణికి మంచి పేరు ఉంది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " 1980లలో నేను నాటకాల వైపు నుంచి రచయితగా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ తరువాత నటుడిగా కూడా నా ప్రయాణం మొదలైంది. చాలామంది కొత్త దర్శకులకు నేనే ఫస్టు రైటర్ .. చాలామంది హీరోలకు నేనే ఫస్టు ఫాదర్" అని అన్నారు.
"ఒకప్పుడు ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉండేవారు. అందువలన టాలెంట్ ఉన్నవారికి ఎక్కువ డిమాండ్ ఉండేది. అలాంటి ఆర్టిస్టు డేట్స్ దొరికేవరకూ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు .. పోటీ ఎక్కువగా ఉంది. అందువలన ఒకరుకాకపోతే .. వారికి బదులుగా వేరొకరు. ఇది వీళ్లు చేస్తేనే బాగుంటుందనేం లేదు .. ఎవరు ఏదైనా చేయవచ్చు అనే ట్రెండ్ నడుస్తోంది.
"హీరో తండ్రిగా .. లేదంటే హీరోయిన్ తండ్రిగా చేసి విసిగిపోయాను. అందువలన ఆ పాత్రలైతే చేయనని చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో తెరపై ఎక్కువగా కనిపించకపోవడానికి కారణమిదే. నాకు నచ్చిన డిఫరెంట్ రోల్స్ ను మాత్రమే అంగీకరిస్తున్నాను. ఒక పాత్రతో పోలికలేని మరొక పాత్రను ఎంచుకుంటూ వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.