Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై వాలంటీర్ పరువునష్టం దావా
- తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ మహిళా వాలంటీర్ దావా
- పవన్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్య
- లంచ్ తర్వాత విచారణ చేపడతామన్న న్యాయస్థానం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. ఆయన తన వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వికరించింది.
ఈ సందర్భంగా సదరు మహిళా వాలంటీర్ మాట్లాడుతూ... తన పరువుకు భంగం కలిగిందంటూ పరువు నష్టం దావా వేశానని చెప్పారు. వాలంటీర్లుగా తాము ఆడవారి డేటాను కలెక్ట్ చేశామని, డేటా చోరీ చేశామని పవన్ ఆరోపించారని, దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. జనసేనాని వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేసారన్నారు. సేవ చేస్తోన్న తమపై నిందలు వేసిన పవన్ ను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కదానినే పిటిషన్ దాఖలు చేశానని, తనను చూసి మిగతా వారు వస్తారన్నారు.
వాలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బార్ అసోసియేషన్ ఆమెకు అండగా ఉంటుందని.. వాలంటీర్ తరఫున పిటిషన్ ఫైల్ చేసిన న్యాయవాది అన్నారు. సెక్షన్ 499, 00, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక పవన్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని, అప్పుడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వాలంటీర్లలో అధిక శాతం మహిళలే ఉన్నారని, వుమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఉంటే ఆధారాలను కోర్టుకు ఇవ్వాలన్నారు.