BrahMos: రష్యా ప్రయోగించిన అన్ని ఆయుధాలను ఎదుర్కొన్న ఉక్రెయిన్ వీటిని మాత్రం కూల్చలేకపోయింది... కారణం ఇదే!
- బ్రహ్మోస్ క్షిపణులను సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారత్, రష్యా
- బ్రహ్మోస్ ను ఓనిక్స్ పేరిట సొంతంగా ఉత్పత్తి చేస్తున్న రష్యా
- ఉక్రెయిన్ నగరంపై ఓనిక్స్ లతో విరుచుకుపడిన పుతిన్ సేనలు
- నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన ఉక్రెయిన్
పాశ్చాత్య దేశాల అండతో రష్యాను దీటుగానే ఎదుర్కొంటున్న ఉక్రెయిన్... ఒడెసా ప్రాంతాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమైంది. రష్యా దాడులతో ఈ ప్రాంతంలో భారీ విధ్వంసం నెలకొంది. ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. తీవ్ర ఆస్తినష్టం సంభవించింది.
రష్యా సైనిక దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్ సేనలు ప్రయోగించిన అనేక ఆయుధాలను సమర్థంగా ఎదుర్కొన్న ఉక్రెయిన్... జులై 19న ఒడెసా ప్రాంతంపై ప్రయోగించిన క్షిపణులను మాత్రం అడ్డుకోలేకపోయింది.
తన అధీనంలోని క్రిమియా నుంచి ఏడు ఓనిక్స్-800 మిస్సైళ్లను రష్యా సంధించింది. ఇవి తమ భూభాగంలోకి ప్రవేశిస్తుంటే చూస్తూ ఉండిపోయిందే తప్ప, ఉక్రెయిన్ వాటిని నిలువరించలేకపోయింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఓనిక్స్-800 మిస్సైళ్లు మన బ్రహ్మోస్ క్షిపణులే... కాకపోతే ఓనిక్స్ అనేది రష్యన్ వేరియంట్. రెండింటికీ ఒకే టెక్నాలజీ వినియోగించారు. భారత్, రష్యా కలిసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేయడం తెలిసిందే. బ్రహ్మోస్ క్షిపణులనే రష్యా ఓనిక్స్-800 మిస్సైళ్లుగా ఉత్పత్తి చేస్తోంది.
జులై 19 నాడు ఉక్రెయిన్ రేవు పట్టణం ఒడెసాపైకి రష్యా మొత్తం 39 అస్త్రాలు సంధించగా, వాటిలో 19 ఆయుధాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఓనిక్స్ మిస్సైళ్లు దూసుకువచ్చినప్పుడు మాత్రం నిస్సహాయంగా చూస్తుండిపోయింది.
దీనిపై ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఓనిక్స్ క్షిపణి బ్రహ్మాండమైన వేగంతో దూసుకొస్తుందని, అంతవేగంగా వచ్చే క్షిపణిని అడ్డుకునే సత్తా ఉక్రెయిన్ కు లేదని అంగీకరించారు. యుద్ధంతో కుదేలైన ఉక్రెయిన్ వంటి దేశాలు ఓనిక్స్ వంటి అత్యాధునిక క్షిపణిని ఎదుర్కొనడం అసాధ్యమని పేర్కొన్నారు.