KCR: రూ.3 కోట్ల విలువైన టమాటా పంట పండించిన రైతు దంపతులను అభినందించిన సీఎం కేసీఆర్

CM KCR felicitates farmer couple for cultivated Tomato crop worth Rs 3 cr

  • దేశంలో భగ్గుమంటున్న టమాటా ధరలు
  • కేజీ రూ.150కి పైనే పలుకుతున్న వైనం
  • డిమాండ్ అదిరిపోతున్న సమయంలో చేతికొచ్చిన టమాటా పంట
  • జాక్ పాట్  కొట్టిన మెదక్ జిల్లా రైతు

గత కొన్నివారాలుగా కూరల్లో టమాటాలు తగినన్ని వేసుకోలేక సగటు జీవి ఎన్ని అవస్థలు పడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలే. దేశవ్యాప్తంగా టమాటా ధర కిలో ఒక్కింటికి రూ.150కి అటూ ఇటూగా ఉంది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఓ తెలంగాణ రైతు జాక్ పాట్ కొట్టాడు. మెదక్ జిల్లా మహ్మద్ నగర్ కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి వేసిన టమాటా పంట కచ్చితంగా ధరలు మండిపోతున్న సమయంలో చేతికొచ్చింది. ఇంకేముందీ... మహిపాల్ రెడ్డి లక్షాధికారి కాదు, ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. 

భారీ విస్తీర్ణంలో మహిపాల్ రెడ్డి టమాటా పంట వేయగా, పంట  విరగ్గాసింది. దానికితోడు అదిరిపోయే డిమాండ్. పంట విలువ అంచనా వేస్తే రూ.3 కోట్లు అని తేలింది. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ప్రగతిభవన్ కు పిలిపించారు. 

టమాటాకు ఎప్పుడు మార్కెట్ అధికంగా ఉంటుందో గమనించి వ్యూహాత్మకంగా పంట పండించిన ఆ దంపతులను సీఎం కేసీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు సరికొత్తగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని వివరించారు. 

రైతు మహిపాల్ రెడ్డి స్పందిస్తూ, ఇప్పటికే తాను రూ.2 కోట్ల విలువైన టమాటా పంటను విక్రయించానని, మరో రూ.1 కోటి విలువైన పంట కోతకు వచ్చిందని వివరించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News