Doksuri: పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ టైఫూన్... చైనా సహా పలు దేశాలపై గురి
- పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్
- బుధవారం నాటికి సూపర్ టైఫూన్ గా మారే అవకాశం
- డోక్సురిగా నామకరణం
- ప్రస్తుతం ఫిలిప్పీన్స్ కు సమీపంలో కేంద్రీకృతం
శక్తిమంతమైన టైఫూన్ (తుపాను)లకు పుట్టినిల్లుగా నిలిచే పసిఫిక్ మహాసముద్రంలో భీకర టైఫూన్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఇది టైఫూన్ స్థాయికి చేరుకుంది. అంటే, దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఫిలిప్పీన్స్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ టైఫూన్ కు డోక్సురి అని నామకరణం చేశారు.
ఇది రాగల కొన్ని గంటల్లో సూపర్ టైఫూన్ స్థాయికి బలపడనుందని ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ 'పగాసా' వెల్లడించింది. దీని ప్రభావం ఫిలిప్పీన్స్, తైవాన్, హాంకాంగ్ తో పాటు చైనాపైనా తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తోంది.
డోక్సురి తొలి పంజాను ఫిలిప్పీన్స్ దీవుల్లో అత్యధిక జనాభా కలిగి ఉండే లూజాన్ దీవిపై విస్తరించనుంది. ఇది కొన్ని గంటల్లోనే దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు. బుధవారం నాటికి డోక్సురి సూపర్ టైఫూన్ గా మారే అవకాశాలున్నాయని, దాంతో 36 సెంటిమీటర్లకు పైగా కుంభవృష్టికి దారితీస్తుందని, 250 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో పలు దీవుల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.
ఈ వారాంతం నాటికి తైవాన్, హాంకాంగ్, చైనాలపై డోక్సురి విరుచుకుపడుతుందని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు తీర ప్రాంతాల యంత్రాంగాలను, ప్రజలను అప్రమత్తం చేశాయి. డోక్సురి దూసుకువస్తుండడంతో, సన్నాహక చర్యలను ముమ్మరం చేశాయి.