organ donation: ఆత్మహత్య ప్రయత్నంలో వరంగల్ బాలిక బ్రెయిన్ డెడ్.. అవయదానం చేసిన పేరెంట్స్
- ఈ నెల 18న ఇంట్లో ఉరేసుకున్న మైనర్
- హైదరాబాద్ నిమ్స్ కు తరలించిన తల్లిదండ్రులు
- సోమవారం బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన వైద్యులు
ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు. చివరకు వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో తమ కూతురు అవయవాలను దానం చేసి ఆ బాలిక తల్లిదండ్రులు మరికొందరికి జీవితాన్ని ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 18న పూజ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో పూజ తల్లిదండ్రులు గమనించి అప్రమత్తమయ్యారు. అయితే, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న పూజను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందించారు.
అయితే, రోజులు గడిచినా పూజ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్సకు స్పందించకపోవడంతో ఈ నెల 24న పూజ బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో జీవన్ దాన్ ప్రతినిధులు పూజ తల్లిదండ్రులను కలిసి అవయవదానం గురించి వివరించారు. దీంతో తమ కూతురు మరికొందరి రూపంలో బ్రతికే ఉంటుందని పూజ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. వైద్యులు పూజ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించి జీవన్ దాన్ సంస్థకు అందజేశారు.