Sub orbital flight: విమానయాన రంగంలో కొత్త శకం.. ప్రపంచంలో ఎక్కడికైనా రెండు గంటల లోపే..!
- విమానరంగంలో సబ్‌ఆర్బిటాల్ ఫ్లైట్ శకం రానుందన్న బ్రిటీష్ సివిల్ ఏవియేషన్ అకాడమీ
- 2033 కల్లా ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లో చేరే విమానయాన సదుపాయాలు వస్తాయని వెల్లడి
- ‘కాంకార్డ్’ను పోలిన ఎక్స్-59 సూపర్ సానిక్ విమానాన్ని పరీక్షిస్తున్న నాసా
విమానయాన రంగంలో సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ శకం ప్రారంభం కానుందని బ్రిటీష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ పరిశోధాత్మక కథనాన్ని ప్రచురించింది. 2033 కల్లా ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా కేవలం రెండు గంటల్లోనే చేరుకునే స్థాయిలో అత్యాధునిక విమానసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇందులో భాగంగా రాకెట్లను పోలిన విమానాల ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతారట. నిటారుగా గాల్లోకి ఎగిరే ఈ విమానాలు ఆకాశంలో సుమారు 125 మైళ్ల ఎత్తువరకు వెళ్లి.. మళ్లీ వేగంగా భూమ్మీద తమ గమ్యస్థానాలవైపు దిగుతాయి. ఈ క్రమంలో 3 వేల మైళ్లకు మించి గరిష్ఠ వేగాలను అందుకుంటూ ప్రయాణ సమయాన్ని అనూహ్య రీతిలో తగ్గించేస్తాయని వెల్లడించింది. ఇప్పటికే జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్, రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గాలెక్టిక్ సంస్థలు ప్రయాణికులకు సబ్ ఆర్బిట్ ఫ్లైట్ ప్రయాణాన్ని పరిచయం చేశాయి.
ఇక అత్యంత వేగవంతమైన ‘కాంకార్డ్’ విమానం కనుమరుగై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. అప్పట్లో ఆ విమానం ఓ సంచలనం. ప్రపంచపు తొలి సూపర్ సానిక్ ఫ్లైట్‌గా చరిత్రకెక్కిన ఈ విమానం 2000లో జరిగిన ఓ ప్రమాదంతో తెరమరుగైపోయింది. అయితే, నాసా ప్రస్తుతం మరో సూపర్ సానిక్ విమానంపై ప్రయోగాలు చేస్తోంది. ఎక్స్-59 పేరుగల ఈ విమానాన్ని త్వరలో నాసా ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. కాంకార్డ్ కంటే నెమ్మదైనప్పటికీ ఈ విమానంతో న్యూయార్క్-లండన్ ప్రయాణ సమయాన్ని ఏకంగా 3.30 గంటల మేర తగ్గించొచ్చట. దీని గరిష్ఠ వేగం గంటకు 1500 కిలోమీటర్లు కాగా, కాంకర్డ్ అప్పట్లో ఏకంగా గంటకు 2000 కిలోమీటర్ల పైచిలుకు వేగాన్ని అందుకుంది.
ఎక్స్-59 విమానంలో ‘క్వైట్ సూపర్ సానిక్ టెక్నాలజీ’ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో, ధ్వనివేగాన్ని అధిగమించే సమయంలో వినిపించే సానిక్ బూమ్(భారీ ధ్వని) తీవ్రత చాలా వరకూ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక సింగిల్ సీటు ఉన్న ఎక్స్-59 విమానం పొడవు కేవలం 100 అడుగులు మాత్రమే ఉంటుందట. గాల్లో 55 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగే ఈ విమానం గరిష్ఠంగా మాక్ 1.4 వేగాన్ని( ధ్వనికి 1.4 రెట్ల వేగం) అందుకోగలదు.