chittoor farmer: టమాట పంటతో ఒక్క నెలలో రూ.3 కోట్లు ఆర్జించిన చిత్తూరు రైతు

chittoor farmer earned 3 crores in one month with tamato crop

  • 22 ఎకరాల్లో టమాట పండించిన రైతు కుటుంబం
  • పెట్టుబడి, రవాణా, ఇతర ఖర్చులు సుమారు రూ.కోటి
  • ఆధునిక సేద్య విధానాలను అవలంబించి లాభాలు ఆర్జించిన రైతు

ఆకాశాన్ని అంటుతున్న టమాట ధరలతో కొంతమంది రైతుల ఇంట్లో సిరులు కురుస్తున్నాయి. మొన్న మహారాష్ట్రలోని పూణేలో ఓ రైతు కుటుంబం టమాట సాగుతో రూ.కోటిన్నర ఆదాయం పొందగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతు కుటుంబం రూ.3 కోట్లు ఆర్జించింది. సాగు ఖర్చులు, రవాణా, మార్కెటింగ్ ఖర్చులు పోనూ రూ.3 కోట్లు సంపాదించుకుంది. మొత్తం 22 ఎకరాల్లో టమాట పండించి మంచి లాభాలను కళ్లజూసింది.

చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమంద గ్రామానికి చెందిన పి.చంద్రమౌళి, అతడి సోదరుడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. వారికి కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపుపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది. ఇందులో 22 ఎకరాల్లో ఏళ్ల తరబడి టమాట పంటను సాగుచేస్తున్నారు. టమాట సాగులో తనకున్న అనుభవంతో పాటు ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వ్యూహాలపై చంద్రమౌళి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటారు. ఏటా వేసవి తర్వాత టమాటకు మంచి ధర పలుకుతున్నట్లు గుర్తించి ఈసారి జూన్, జులైలో దిగుబడి వచ్చేలా టమాట సాగు చేశారు.

ఈ ఏడు ఏప్రిల్ లో సాహూ రకం టమాటను చంద్రమౌళి సాగు చేశారు. ఆధునిక పద్ధతులతో సూక్ష్మ సేద్యం విధానాలను అనుసరిస్తూ పండించారు. జూన్ నెలాఖరు నుంచి టమాట దిగుబడి మొదలు కాగా కర్ణాటకలోని కోలార్ మార్కెట్ లో పంటను విక్రయించారు. మార్కెట్ లో 15 కిలోల టమాట పెట్టెకు రూ.1000 నుంచి రూ.1500 వరకు ధర పలికింది. ఇప్పటి వరకు 40 వేల పెట్టెలను అమ్మగా రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి చెప్పారు. పెట్టుబడి ఖర్చు రూ.70 లక్షలు, మార్కెట్ లో కమిషన్ రూ.20 లక్షలు, రవాణా ఖర్చులు రూ.10 లక్షలు పోగా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News