INDIA: 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?
- మణిపూర్ హింసపై అట్టుడుకుతున్న పార్లమెంటు
- మణిపూర్ ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
- ఈ ఉదయం మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
మణిపూర్ లో జాతుల మధ్య చోటు చేసుకున్న హింస అంశం పార్లమెంటులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశం కారణంగా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో... కేంద్రానికి వ్యతిరేకంగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
మరోవైపు ఈ ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇంకోవైపు ఈ సమావేశంలో విపక్షాల తీరుపై మోదీ మండిపడినట్టు సమాచారం. దశ, దిశ లేకుండా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.