Ganta Srinivasa Rao: మీ మూర్ఖత్వపు చర్యలతో నిరుపేదలు బలైపోతారు: జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్

former minister ganta srinivas rao tweet on cm jagan

  • జగన్ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారన్న గంటా
  • పేదల సంక్షేమం ముసుగులో అమరావతిని ధ్వంసం చేస్తున్నారని విమర్శ
  • కోర్టు ఉత్తర్వులు వెల్లడించకుండానే ఇళ్లకు శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్న
  • తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీత
  • అతి సంపన్న సీఎం.. నిరుపేదని చెప్పుకోవడం పెద్ద జోక్ అని ఎద్దేవా

ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌‌ వేదికగా విమర్శలు చేశారు. 

‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమే ఇది. ఒకవేళ రేపు తుది తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే ఆ సెంటు భూమిలో ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని గంటా నిలదీశారు. 

మీ మూర్ఖత్వపు చర్యల వల్ల ఇళ్లు కట్టుకున్న అమాయకమైన పేదలు నిలువునా బలైపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు ఆగమేఘాల మీద, అది కూడా తుది తీర్పు వెలువడక ముందే పట్టాలు పంపిణీ, శంకుస్థాపనలు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 

‘‘రైతుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి.. పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో అమరావతిని నాశనం చేసేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తూ నాటకాలు ఆడుతున్నారు” అని మండిపడ్డారు.  

‘‘స్వార్థపూరిత రాజకీయ జిత్తులకు అమాయకమైన నిరుపేదలను బలిచేస్తూ.. ‘నేను పేదల పక్షాన పోరాడుతున్నాను, రాష్ట్రంలో పేదలకు పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరు నడుస్తోంది’ అంటూ దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్న మీరు చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు!” అని సెటైర్లు వేశారు. 

‘‘ప్రతి మీటింగ్‌లో ప్రతిసారి నిరుపేదని, నాకు అంగబలం లేదు, నాకు ఆర్థిక బలం లేదు, నాకు మీడియా బలం లేదు, నాకు మోసం చేయడం తెలియదు, నాకు నక్కజిత్తులు తెలియవు, నేను ఒక అమాయకుడిననే పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు. 2019లో "ఒక్క అవకాశం" మాయలో పడి కోలుకోలేని అతి పెద్ద తప్పు చేశారనేది జనం తెలుసుకున్నారు. విముక్తి కోసం అదే ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని 2024 కోసం ఎదురు చూస్తున్నారు” అని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News